YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సమస్యల రాదారి

సమస్యల రాదారి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని తుంగపాడు వద్ద రామన్నపేట-లావుడితండాల మధ్య రహదారి సమస్యల నిలయంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోడ్డు నరకప్రాయంగా మారిందని ఆరోపిస్తున్నారు. మొత్తంగా రోజూ ప్రమాదాల బారిన పడుతూ ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వాస్తవానికి ఈ రోడ్డు పుష్కరాలప్పుడు మొదలు పెట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మితం కాకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అంతా అంటున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. రూ.4 కోట్ల నిధులు ఉన్నా.. రోడ్డు నిర్మాణంపై గుత్తేదారు ఉదాసీనంగా ఉన్నారు. 

 

కాంట్రాక్టర్ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని, కింది స్థాయి అధికారులను ఖాతరు చేయకుండా రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల అనుమతులు లభించక గుత్తేదారుకు నోటీసులు పంపలేకపోతున్నామని కిందిస్థాయి అధికారులు అంటున్నారు. పురష్కరాలప్పుడు మండల పరిధిలోని తుంగపాడు గ్రామం నుంచి అడవిదేవులపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర రూ.20 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టారు. అయితే పుష్కరాలు సమీపించడంతో రోడ్డు నిర్మాణాలను మధ్యలో వదిలేశారు. పుష్కరాలనంతరం మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అదనంగా రూ.4 కోట్లు మంజూరు చేసినా కాంట్రాక్టర్ మాత్రం కాలయాపన చేస్తున్నారు. నిధులు ఉన్నా రోడ్డు నిర్మాణాలను చేపట్టకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల భద్రతను పట్టించుకోవాలని, రహదారిని పూర్తి స్థాయిలో నిర్మించేలా సదరు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. లేదంటే ప్రమాదాలకు చెక్ పడదని హెచ్చరిస్తున్నారు.

Related Posts