దళితబంధు పథకాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్
ప్రతివాదులుగా సీఎం కేసీఆర్, ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి,
కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముందు 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో అమలు చేయాలి
హైదరాబాద్ జూలై 31
హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు బి.సంగీత, కాసాని రత్నమాల, ఎ.ఆనంద్‌లు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని, అక్కడ దళిత బంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్‌లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కల సురేష్‌కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్‌లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.