చీడ పురుగులు, విష పురుగులు మా సీఎం దగ్గరకు చేరాయి
ఎంపీ రఘురామ కృష్ణమరాజు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణమరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయి బెయిల్ రద్దు చేయమని సోమవారం సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు. శనివారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. చీడ పురుగులు, విష పురుగులు సీఎం జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు చేరాయన్నారు. ‘మా సీఎం దగ్గర ఉన్న చీడ పురుగులకు అదనంగా మరో చీడ పురుగు చేరింది’ అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నేత దేవినేని ఉమ అరెస్టు, రాజమండ్రి జైలుకు తరలింపు అక్కడి సూపర్ డెంట్‌ను మార్చడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఒక మంచి ఉద్దేశం ఉన్న ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కారులో ఉన్న వ్యక్తి దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేవినేనిపై 307 సెక్షన్ కేసు పెట్టాలంటే స్పాట్‌లో మారణాయూధాలు, గాయం అయి ఉండాలన్నారు. ఎలాంటి ఆయూధాలు లేకుండా ఒక్క రక్తపు మరక లేనప్పుడు దేవినేనిపై 307 సెక్షన్ కేసు ఎలా పెట్టారని నిలదీశారు. కేసు పెట్టి, జైలుకు తరలించి అక్కడి సూపర్‌టెండెంట్‌ను ఎందుకు ఆకస్మాత్తుగా మార్చారని రఘురామ ప్రశ్నించారు. ఉమ ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. ఆయన రూమ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని లింక్‌ను మేజిస్ట్రేట్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని మానవ హక్కుల నాయకులు కాని అక్కడి ప్రముఖులు ఎవరైనా ప్రతి రోజు దేవినేని ఉమ రూమ్‌ను సందర్శించేలా చూడాలన్నారు. చట్టాలు, సెక్షన్లును దుర్వినియోగం చేసి రాజకీయ ఒత్తిళ్లతో అన్యాయంగా కేసులు పెడితే అలాంటి పోలీసు అధికారులపై న్యాయ స్థానాలను ఆశ్రయించి కేసులు పెట్టాలని రఘురామ కృష్ణమరాజు తెలిపారు. రాష్టంలో కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి బకాయిలు కూడా రావడం లేదని రఘురామ కృష్ణమరాజు అన్నారు.