వ్యాక్సిన్ తీసుకున్న రాహుల్
న్యూఢిల్లీ,
గ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు కరోనావైరస్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. బుధవారం ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగానే రాహుల్ గురువారం, శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు శనివారం పేర్కొన్నాయి. కాగా.. కరోనా ప్రారంభం నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ వ్యూహంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ టీకా వేయించుకుని.. ఉత్కంఠకు తెరదించారు.కాగా.. రాహుల్ గాంధీ కరోనా టీకా ఎందుకు తీసుకోవడం లేదని గతంలో బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రతోపాటు పలువురు నాయకులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఏప్రిల్ 20న కరోనా వైరస్ సోకడంతో టీకా ఆలస్యమైందంటూ పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ క్రమంలో రాహుల్ బుధవారం టీకా వేయించుకుని.. సస్పెన్స్‌కు తెరదించారు. అయితే రాహుల్ కోవాక్సిన్ తీసుకున్నారా..? లేక కోవిషీల్డ్ తీసుకున్నారా..? అనేది స్పష్టంగా తెలియరాలేదు.ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని బీజేపీ అనేక సందర్భాల్లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం కరోనా వ్యాక్సిన్‌ను విశ్వసిస్తుందా..? అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు సైతం ఎదురుదాడికి దిగారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవడం ఆలస్యమైందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.