
పుంజుకున్న మహిళా హాకీ టీమ్
టోక్యో,
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ పుంజుకుంది. వందన కతారియా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి. ఈరోజు సాయంత్రం బ్రిటన్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా లేదా ఐర్లాండ్ ఓడినా భారత్ మహిళల జట్టుకి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖరారుకానుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే..? అప్పుడు భారత్ జట్టు నిష్క్రమిస్తుంది.మ్యాచ్ నాలుగో నిమిషంలోనే గోల్ కొట్టిన వందన భారత్‌ని 1-0తో ఆధిక్యంలో నిలిపింది. కానీ.. 30 సెకన్ల వ్యవధిలోనే గ్లాబ్సీ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. కానీ.. ఆ తర్వాత 17 నిమిషంలో వందన గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా నుంచి కూడా 30, 39వ నిమిషాల్లో గోల్స్ వచ్చాయి. మధ్యలో నేహా గోయల్ కూడా 32వ నిమిషంలో గోల్ చేసింది. మొత్తంగా.. 3-3తో మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతున్న సమయంలో వందన మరోసారి 49వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ని 4-3తో ఆధిక్యంలో నిలిపింది. ఇక అక్కడ నుంచి ఒత్తిడిలోకి వెళ్లిన దక్షిణాఫ్రికా టీమ్ చివరి వరకూ గోల్ కోసం శతవిధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.