ఏలూరు, ఆగస్టు 2,
ఖరీఫ్ కాలంలో రెండు మాసాలు గడుస్తున్నా పంటల సాగులో పెద్దగా పురోగతి లేదు. సేద్యం నెమ్మదిగా సాగుతోంది. సీజన్‌లో జూన్, జులై నెలలు సాగుకు అత్యంత కీలకమైనవి. ఇప్పటికి సగం సేద్యం పూర్తవ్వాలి. ఈ తడవ సాధారణ సాగులో 37 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. అదే నిరుడు 54 శాతం సాగు నమోదైంది. జూన్‌లో రుతుపవనాలు మొరాయించగా జులై మధ్య నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆశాజనకంగా పడుతున్నాయి. అయినప్పటికీ పంటల సాగు నత్తనడకన సాగుతోంది. జూన్ నెలాఖరుకు సాధారణవర్షంలో 9.8 శాతం తక్కువ వర్షం నమోదైంది. సాంకేతికంగా రాష్ట్ర సగటు నార్మల్ అయిన ప్పటికీ ఆరు జిల్లాలు తక్కువ వర్షం కురిసిన కేటగిరీలో ఉన్నాయి. నెల్లూరు అత్యల్ప వర్షం పడ్డ కేటగిరీలో ఉంది. జులై 15కు వచ్చేసరికి నార్మల్ కంటే 17.1 శాతం ఎక్కువ వర్షం నమోదైంది. అప్పుడు కూడా నెల్లూరు తక్కువ వర్షం కేటగిరీలోనే ఉంది. జులై 29కి వచ్చేసరికి అన్ని జిల్లాలూ నార్మల్ కిందకొచ్చాయి. రాష్ట్ర సరాసరి 16.6 శాతం ఎక్కువ వర్షం పడింది. ఇప్పటికి 279.8 మిల్లీమీటర్లకు 240 మిమీ కురిసింది.ఖరీఫ్‌లో వరి తర్వాత వేరుశనగ, పత్తి సేద్యం ఎక్కువ. సాధారణంగా ఈ రెండు పంటల సాగు జులై నెలాఖరుకల్లా పూర్తయిపోతుంది. కానీ ఈ మారు బాగా మార్పొచ్చింది. తొలకరి వానలకు అనంతపురం, ఇతర రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ వేస్తారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లలో అధిక వానలు పడి పంట నష్టం జరిగినందున, మధ్యమధ్య డ్రైస్పెల్ సైతం నెలకొన్నందున వేరుశనగ సాగుపై రైతులు అనాసక్తిగా ఉన్నారు. కొంచెం ఆలస్యంగా సాగు చేయాలన్న ఆలోచనా చేస్తున్నారు. ఆ రీత్యా సాగు గణనీయంగా తగ్గింది. నిరుడు ఈ పాటికి 6.77 లక్షల హెక్టార్లలో సాగు కాగా ఈ తడవ 3.27 లక్షల హెక్టార్లలోనే పడింది. నిరుడు కంటే సగానికిపైగా సాగు తగ్గింది. సీజన్ నార్మల్ సాగులో 46 శాతమే వేశారు. ఒక్క అనంతపురంలోనే నిరుడు ఈ వేళకు 4.55 లక్షల హెక్టార్లలో సాగవగా ఈ సంవత్సరం 1.76 లక్షల హెక్టార్లు సాగైంది. వేరుశనగ తగ్గడంతో మొత్తంగా నూనెగింజల సాగుపై ప్రభావం పడింది. సీజన్ నార్మల్‌లో 45 శాతమే సాగు నమోదైంది. ఇక వాణిజ్యపంట పత్తి సాగు సైతం తగ్గింది. సీజన్ నార్మల్‌లో 52 శాతమే పడింది. గుంటూరు, కృష్ణాలో నిరుటి కంటే సగానికి సగం సాగు తగ్గింది.వరి సాగు సైతం తగ్గింది. ఉత్తరాంధ్రలో కాస్త ముందుగా వరి సాగు చేయడం ఆనవాయితీ. మొన్నటి వరకు వానల్లేని కారణంగా వరి తగ్గింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో వరి సాగు నార్మల్ కంటే తగ్గగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరులో స్వల్పంగా పెరిగింది. అనంతపురంలో వేరుశనగ స్థానంలో కందులు సాగు చేస్తున్నారని చెబుతున్నా గణాంకాల్లో అది కనిపించట్లేదు. వేరుశనగ తగ్గినప్పటికీ కందుల సాగు సైతం నిరుటి కంటే బాగా తగ్గింది. జిల్లాలవారీగా చూసుకుంటే ప్రకాశంలో కనిష్టంగా 36 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత విజయనగరంలో 48 శాతం సాగు నమోదైంది.