న్యూఢిల్లీ ఆగష్టు 2
దేశాన్ని పట్టిపీడిస్తున్న అంశాలపై చర్చకు మోదీ సర్కార్ ఆసక్తి కనబరచడం లేదని, బిల్లులను ఆమోదంపైనే దృష్టిసారిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్‌లో పెగాసస్ వ్యవహారం ప్రస్తావనకు రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సభ సజావుగా నడవనిపక్షంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పెగాసస్‌పై చర్చ జరిగితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని మోదీ సర్కార్ భయపడుతోందని అన్నారు. చర్చకు సిద్ధమని చెబుతున్నా ఈ అంశంపై చర్చకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం, కొవిడ్-19, పెట్రో ధరల పెంపు, రఫేల్ ఒప్పందంలో అవినీతి వంటి అంశాలు చర్చకు రాకుండా కీలక బిల్లులను ఆమోదింపచేసుకుని చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత దుయ్యబట్టారు. మరోవైపు పెగాసస్ వ్యవహారంపై చర్చించాని కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, మాణిక్యం ఠాకూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చర్చ కోసం రాజ్యసభలో 267 నిబంధన కింద కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా నోటీసు ఇచ్చారు.