విశాఖపట్నంనగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. కాన్వెంట్ సెంటర్ వద్ద భారీగా నీరు చేరింది. దీంతో బ్రిడ్జి కింద సిటీ బస్సు ఇరుక్కుపోయింది. ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.విజయవాడలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలాయి. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలోని కింకిపాడు ప్రాంతంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బందర్ రోడ్డు నీట మునగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.కర్నూలు జిల్లాలోని పాండ్యంఓర్వకళ్లు మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. కాయలతోపాటు చెట్లు కూలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండలతో అల్లాడుతున్న తరుణంలో కురిసిన వర్షం జిల్లా వాసులకు కాస్త ఉపసమనం ఇచ్చింది.