జగన్‌తో టీడీపీ నేత కుమారుడి భేటీ..
నాన్నతో చర్చించాకే వైసీపీలోకి: సుమంత్
‘పేట’ టీడీపీలో కలకలం
జడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్‌రెడ్డి మంగళవారం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలవడం స్థానికంగా చర్చనీయంశమైంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి వేనాటి మునిరెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. దీంతో అధిష్ఠానం సైతం ఆయన్ను గుర్తిం చి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవినే కట్టబెట్టింది. జిల్లా సెంట్రల్‌బ్యాంక్ చైర్మన్‌గా సైతం మునిరెడ్డికి అవకాశం దక్కింది. అలా వేనాటి కుటుంబం అంటేనే టీడీపీ అన్న భావన ఇక్కడి ప్రజల్లో నెలకొని ఉండేది. వేనాటి మునిరెడ్డి మృతి చెందటంతో తెరవెనుక ఉంటూ తన అన్నకు కుడిభుజంగా వ్యవహరించిన వేనా టి రామచంద్రారెడ్డి తెరముందుకొచ్చి, టీడీపీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నేతలు పలు కేసులు నమోదు చేయించినా వేనాటి వర్గీయులు మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉండిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తదుపరి జడ్పీ ఎన్నికల్లో వేనాటి రామచంద్రారెడ్డిని చైర్మన్‌గా చేసేందుకు పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ, అదృ ష్టం ముఖం చాటేయడంతో చైర్మన్ కుర్చీ దక్కలేదు. ఈ నేపథ్యంలో మంది ఎక్కువై మజ్జిగ పలుచన అయినట్లు పార్టీలో నేతలు ఎక్కువైపోయారు. వేనాటి వర్గానికి ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. పార్టీలో నేతల ఎత్తులపై ఎత్తులకు వేనాటి రామచంద్రారెడ్డి వెనుకపడాల్సి వచ్చింది. వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు వేనాటి సుమంత్‌రెడ్డి గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి వైస్ చైర్మన్ పదవిని ఆసించినా దక్కలేదు. వేనాటి వర్గానికి నామినేటెడ్ పదవులు రాకుండా పోయాయి. దీంతో రాజకీయాల కారణంగా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందంటూ వేనాటి కుటుంబంలో కలహాలు రేగాయి. వేనాటి మునిరెడ్డి కుమారులకు వేనాటి రామచంద్రారెడ్డిల మధ్య స్పర్థ లు రేగాయి. ఇటు కుమారుడు సుమంత్‌రెడ్డి దూకుడుకు కళ్లెం వేయలేక అటు అన్న కుమారులు కలసి రాక రామచంద్రారెడ్డి రాజకీయాల్లో మరీంత వెనుకపడిపోయారు. జిల్లా మంత్రులు పి.నారాయణ అండ, సోమిరెడ్డి సానుభూతి వల్ల కాస్తోకూస్తో వేనాటి వర్గం ఈ ప్రాంత రాజకీయాల్లో కొనసాగుతుందన్న విషయం అందరెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కేసుల్లో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చిక్కుకోవడంలో వేనాటి వర్గం బలం పుంజుకునే పరిస్థితి ఏర్పడింది. పైగా వేనాటి రామచంద్రారెడ్డి టీటీడీ సభ్యత్వాన్ని కోరుతుండటంతో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ తరుణంలో..ఇంతలో హఠాత్తుగా ఆయన కుమారుడు వేనాటి సుమంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్‌ను కలవడం నియోజవర్గ టీడీపీలో పెద్ద కలకలం రేపింది. వేనాటి రామచంద్రారెడ్డి, ఆయన బంధువర్గం తీవ్రంగా ప్రయత్నించినా సుమంత్‌రెడ్డి ససేమీర అంటూ వెళ్లిపోవడం విశేషం. జగన్‌ను కలిశాక మీడియాతో సుమంత్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ అంటే అభిమానమని, ఆయన విజన్ తనను ఆకట్టుకుందని చెప్పడం టీడీపీ వర్గాలలో విమర్శలకు తావిస్తోంది. తన తండ్రి అనుమతి తరువాతే పార్టీ ప్రవేశమంటూ సుమంత్‌రెడ్డి ప్రకటించడం వేనాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందా!? అన్న చర్చలు జోరందుకున్నాయి. వేనాటి వర్గానికి పార్టీలో బలం పెరగకుండా చేసేందుకు కొంతకాలంగా జరుగుతున్న చాణక్య రాజకీయాల్లో భాగంగానే వేనాటి సు మంత్‌రెడ్డి జగన్‌వైపు చూపుతిప్పినట్లు రాజకీయ విశ్లేషికులు వ్యాఖ్యానిస్తున్నారు.
చనిపోయే వరకు టీడీపీలోనే..‘‘వేనాటి కుటుంబం అంటేనే టీడీపీ. చనిపోయేవరకు నా అన్న పార్టీలోనే ఉన్నారు. ఆయన బాటలోనే నడుస్తా.’’అని మీడియాతో వేనాటి రామచంద్రారెడ్డిఅన్నారు. అయితే సుమంత్‌రెడ్డి జగన్‌ను కలవడంపై ఆయన నో కామెంట్ అంటూ దాట వేయటం భేతాళప్రశ్న అయ్యింది. వేనాటి కుటుంబం టీడీపీలో కొనసాగుతుందా... లేదా వైసీపీ పంచన చేరుతుం దాఅన్న విషయంపై నియోజకవర్గంలో పెద్ద చర్చ అవుతోంది.