YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల పాదయాత్రకుబ్రేక్..

ఈటల పాదయాత్రకుబ్రేక్..

ఈటల పాదయాత్రకుబ్రేక్..
కరీంనగర్, ఆగస్టు 2, 
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రకు మధ్యలోనే  ఫుల్ స్టాఫ్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైన ఈటల రాజేందర్‌ అస్వస్థత నుంచి కోలుకుంటున్నారు. సడెన్‌గా మోకాలి నొప్పి రావడంతో… అపోలో ఆస్పత్రిలోనే మోకాలికి ఆపరేషన్‌ చేశారు. దీంతో ఈటల రాజేందర్‌ పాదయాత్ర కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోకాలి ఆపరేషన్‌ తర్వాత ఎక్కువగా నడవొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు పాదయాత్ర ప్రత్యామ్నాయాలపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు సమాలోచనలు చేస్తున్నారు. పాదయాత్ర వీలుకాని పక్షంలో ఈటల రాజేందర్‌ వీల్‌ ఛైర్‌లోనే గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. గడప గడపకు వెళ్లి వీల్‌ఛైర్‌లోనే ఓటర్లను పలకరించాలని భావిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్‌ సతీమణి జమునతో పాదయాత్ర కొనసాగిస్తే ఎలా ఉంటుంది ? ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా ? అన్న కోణంలోనూ కుటుంబసభ్యుల్లో చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం.హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 12 రోజుల పాటు 222 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించారు ఈట రాజేందర్‌. తన సొంత మండలం కమలాపూర్‌లో పాదయాత్ర పూర్తి చేసి… వీణవంక మండలంలో పర్యటిస్తున్న క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నా… మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి మరోవారం గడిస్తే తప్ప ఈటల రాజేందర్‌ పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈటల రాజేందర్ పాదయాత్ర వీలుకాని పక్షంలో ఏమి చేయాలన్న అంశంపై త్వరలోనే క్లారిటీ రావచ్చని చెబుతున్నారు.

Related Posts