YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొండపల్లి మైనింగ్‌ సెగలు

కొండపల్లి మైనింగ్‌ సెగలు

విజయవాడ, ఆగస్టు 3, 
కొండపల్లి కొండను తవ్వింది ఎవరు? తవ్వుకుని లాభపడింది ఎవరు? కొండ కరుగుతున్న సమయంలో రాజకీయ సెగ ఎందుకు రాజుకుంది? పైచెయ్యి సాధించాలనే ఎత్తులు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? మాటలతో ఒకరు.. సాంకేతిక అంశాలతో ఇంకొకరు.. ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా వైసీపీ, టీడీపీ మధ్య కస్సుబస్సులు కామన్‌. దీనికంతటికీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమాలే కారణం. గతంలో నందిగామ కేంద్రంగా జరిగే వ్యవహారాలు ఇప్పుడు మైలవరానికి షిఫ్ట్‌ అయ్యాయి తప్ప.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. తాజాగా వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవటానికి ప్రధాన కారణం కొండపల్లి క్వారీయింగ్. టీడీపీ హయాంలో అక్రమంగా తవ్వేశారంటే.. కాదు వైసీపీ హయాంలోనే తవ్వేశారని పరస్పరం ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడది మరింత పీక్‌కు వెళ్లింది.గత ప్రభుత్వ హయాంలోనూ కొండపల్లిలో మైనింగ్‌ జరిగింది. ఆ అంశంపైనే వైసీపీ సర్కార్‌ ఇప్పుడు ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా వచ్చి క్రషర్లు ప్రారంభించారు. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. టీడీపీకి చెందిన కొందరు నాయకులకు కూడా ఇక్కడ మైనింగ్‌ ఉంది. రెవెన్యూ భూమి కావడంతో మైనింగ్ చేస్తున్నామంటున్నారు టీడీపీ నాయకులు. దేవినేని ఉమా ఎందుకు అటవీ భూమిగా ఆరోపిస్తున్నారో తెలియడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. అధికారపార్టీని ప్రశ్నిస్తున్న టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ఈ వీడియోలను, ఫొటోలను అస్త్రాలుగా సంధిస్తోంది వైసీపీ.కొండపల్లి క్వారీయింగ్‌లో రెండు ప్రభుత్వాల హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరిగిందనే వాదన ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఒకసారి 10 లక్షల ఫైన్‌ వేశారు. 8 జేసీబీలు, 7 టిప్పర్లను సీజ్ చేశారు. అయితే గత ఐదేళ్లకాలంలో అటవీ భూముల్లో జరిగిన మైనింగ్‌కు వైసీపీయే కారణమన్న ఉమా ఆరోపణలకు చెక్ పెట్టడానికి అధికారపార్టీ గట్టి హోంవర్క్ చేస్తోందట. 2014 నుంచి 2019 వరకు వివాదాలకు కేంద్రంగా ఉన్న 143, 26/1 సర్వే నంబర్లలో జరిగిన తవ్వకాలపై గూగుల్ మ్యాపింగ్‌ను వైసీపీ బయటకు తీసింది. ఏటా ఆ సర్వే నంబరులో జరిగిన మార్పులను ప్రజల ముందు పెడుతోంది. వైసీపీ హయాంలో నిబంధనలకు మించి జరిగిన మైనింగ్‌పై ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారు. అందువల్ల గూగుల్‌ చిత్రాల ఆధారంగా.. సాంకేతిక అంశాలను ఒడిసిపట్టి మాజీ మంత్రి ఉమాపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో కొండపల్లి మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లి వేరే కేసులో ఇరుక్కున్న ఉమాను.. ఈ విషయంలో పక్కగా కార్నర్‌ చేయబోతోంది. మరి.. ఈ రగడ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Related Posts