YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అభిజత్ ముఖర్జీ తో ఆశలు

అభిజత్ ముఖర్జీ తో ఆశలు

కోల్ కత్తా, ఆగస్టు 3, 
రాజకీయాలకు, రక్త సంబంధాలకు పొంతన లేదు. ఈ రెండూ వేర్వేరు అంశాలు. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూడలేం. ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీలకు, సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించడం కొత్తేమీ కాదు. పాత రోజుల్లో అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ లో, ఆయన తమ్ముడు నీలం రాజశేఖరెడ్డి సీపీఐలో కొనసాగారు. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ఆయన బాబాయి కుమారుడు వరుణ్ గాంధీ భాజపాలో ఉన్నారు. తాజాగా తెలంగాణలో సీనియర్ నాయకుడైన ధర్మపురి శ్రీనివాస్ కుమారుల్లో ఒకరైన అర్వింద్ భాజపా ఎంపీకాగా, మరో కుమారుడు సంజయ్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో ఉండగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీని నడుపుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం.తాజాగా మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కుమార్తె రాజకీయంగా విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. కూతరు శర్మిష్ట ముఖర్జీ హస్తం పార్టీలోనే కొనసాగుతుండగా ఆమె సోదరుడైన అభిజిత్ ముఖర్జీ తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజకీయంగా ఎవరి దారి వారు చూసుకున్నట్లయింది. జాదవపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న అభిజిత్ రాజకీయాల వైపు అంతగా ఆసక్తి చూపలేదు. తండ్రి ప్రణబ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటికీ అభిజిత్ ఉద్యోగ మార్గాన్నే ఎంచుకున్నారు. బీహెచ్ ఈ ఎల్ (భారత్ హెవీ ఎలటక్రిల్ లిమిటెడ్), సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ), మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ వంటి దిగ్గజ కంపెనీల్లో ఉన్నతాధికారి గా పని చేశారు. తరవాత రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు.2011 అసెంబ్లీ ఎన్నికల్లో ‘నల్హతీ’సీటు నుంచి కాంగ్రెస్ తరఫున అభిజిత్ ముఖర్జీ గెలుపొందారు. 2012లో తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ర్టపతి కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ముర్షీదాబాద్ జిల్లాలోని జాంగీపూర్ పార్లమెంటు స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి గెలుపొందారు. 2019లో టీఎంసీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కనుమరుగైన నేపథ్యంలో ఆ పార్టీ లో ఉండి ప్రయోజనం లేదన్నది అభిజిత్ ముఖర్జీ భావన. అందుకే పార్టీని వీడారు. ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు లభించవచ్చు. అభిజిత్ నిర్ణయాన్ని ఆయన సోదరి శర్మిష్ట ఏమీ తప్పు బట్టలేదు. అలా అని సమర్థించ లేదు. అది ఆయన వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు.తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్లో పుట్టి దిల్లీలో పెరిగిన ఆమె ప్రముఖ నర్తకి. 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీలు ఎక్కువగా ఉండే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ తనకు హస్తం పార్టీలోనే భవిష్యత్తు ఉందని విశ్వసిస్తున్నారు. ఏదో ఒక రోజున రాజకీయంగా తాను వెలుగులోకి వస్తానన్నది ఆమె నమ్మకం. రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ తన తండ్రి పార్టీని వీడలేదని ఆమె గుర్తు చేస్తున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయంగాతో పాటు వ్యక్తిగతంగాను విభేదాలు ఉన్నాయని వారి సన్నిహితులు చెబుతుంటారు. గతంలో తమ తండ్రి రచనల ముద్రణ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ప్రణబ్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన వెంట అభిజిత్ ముఖర్జీ కన్నా శర్మిష్ట ఎక్కువగా కనిపించేవారు. తండ్రి రాజకీయ వారసురాలు తానేనన్నది ఆమె భావన.

Related Posts