YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

చిత్తశుద్ధితో పనిచేస్తేనే గ్రామ స్వరాజ్యం, ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి పంచాయతీరాజ్ శాఖ నూతన పౌరసేవల వెబ్ సైట్ ను ఆవిష్కరన - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్తశుద్ధితో పనిచేస్తేనే గ్రామ స్వరాజ్యం, ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి పంచాయతీరాజ్ శాఖ నూతన పౌరసేవల వెబ్ సైట్ ను ఆవిష్కరన - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేస్తేనే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ విస్తరణ అధికారుల (ఈఓపీఆర్డీ) కు గురువారం నూతన పంచాయతీరాజ్ చట్టంపై  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... దేశానికే తెలంగాణ గ్రామాలను ఆదర్శంగా నిలుపాలనే లక్ష్యంతో దాదాపు 25 ఏళ్ల తరువాత నూతన పంచాయతీరాజ్ చట్టానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. ఈ చట్టం అమలు పైనే తెలంగాణా గ్రామాల అభివృద్ధి ఆధారప‌డి ఉంటుందని... చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డంలో అధికారుల‌దే కీల‌క పాత్ర‌ అన్నారు. అధికారులందరికి నూతన చట్టంపై అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నో చ‌ట్టాలున్నా అమ‌లుకు నోచుకోవ‌డం లేదని... నూతన పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరిపై ఉందన్నారు. సర్పంచ్‌లకు, పంచాయతీ పాలక వర్గానికి పూర్తి అధికారాలను ఈ చట్టం ద్వారా ఇవ్వడం జరుగుతుందని, అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామపంచాయతీలకు భవిష్యత్ లో ఆదాయం, నిధుల కేటాయింపు భారీగా పెరగనుందని, వ్యయం మాత్రం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని ప్రభుత్వమే సరఫరా చేయనుందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో ప్రతిగ్రామంలో సీసీ, బీటీ రోడ్లను ప్రభుత్వమే వేసిందని గుర్తుచేశారు. పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పాలకవర్గాలు పనిచేసేలా అధికారులు సహకరించాలన్నారు. ప్రతిగ్రామంలోను నర్సరీలు ఏర్పాటుచేసేలా వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదవి చేపట్టిన మూడేండ్లలో గ్రామంలో వందశాతం అక్షరాస్యత సాధించడంతో పాటు, వందశాతం మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను పాలక వర్గాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికి కార్యక్రమాలను నిర్వహించడంలో పంచాయతీల పాలక వర్గాలు విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలకవర్గం చేసిన తీర్మానాలను అమలు చేయడంలో సర్పంచ్, కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కలెక్టర్ చర్యలు తీసుకుంటారన్నారు.  దీనిపై ఇప్పటివరకు మంత్రికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండగా, నూతన చట్టంలో మంత్రికి ఉన్న అధికారాన్ని తొలగించి, రాజకీయాలకతీతంగా ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయాలని పొందుపరిచామన్నారు. వారం రోజుల్లో పంచాయతీల ఆదాయ, వ్యయాల సమాచారాన్ని అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ లో ఉంచాలని ఆదేశించారు.  గ్రామ అభివృద్ధి కోసం ప్రతినెలా పాల‌క‌వ‌ర్గ స‌మావేశాలు, ప్ర‌తి రెండు నెల‌ల‌కు గ్రామసభలను నిర్వహించాలని, ఇందులో విఫలమైతే చర్యలు తప్పవన్నారు. పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పశుసంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీహాళ్లతోపాటు ప్రభుత్వసంస్థల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేలా పాలకవర్గం చర్యలు తీసుకునేలా అధికారులు చూడాలన్నారు. పాత బావులు, వినియోగంలోలేని బోరుబావులను గుర్తించి, వాటిని మూసివేయించే బాధ్యత నూతన చట్టం ద్వారా పంచాయతీలకు అప్పగించడం జరిగిందన్నారు. రోడ్లు, మురుగునీటికాల్వలు, ఇతర పబ్లిక్ స్థలాల్లో చెత్తను వేస్తే.. రూ. 500 జరిమానా విధించే అధికారం సర్పంచ్‌కు ఈ చట్టం ద్వారా ఉంటుందన్నారు. గ్రామంలో నాటిన మొక్కల్లో 85 శాతం మనుగడ సాధించేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌, కార్యదర్శులదే అన్నారు. నిబంధనల ప్రకారం లే ఔట్ ఆమోదం, భవన నిర్మాణ అనుమతులను పంచాయతీ పాలకవర్గాలు మంజూరుచేయాల్సి ఉంటుందన్నారు. అయితే పరిశ్రమల ఏర్పాటు అనుమతులతో పంచాయతీలకు సంబంధం లేదన్నారు. నూతన చట్టం ద్వారా సర్పంచ్, ఉప సర్పంచ్ లకు కలిపి చెక్ పవర్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను నియమించుకునే అవకాశం నూతన చట్టంలో పొందుపరిచామన్నారు.అనంతరం పంచాయతీరాజ్ శాఖ నూతన పౌరసేవల వెబ్ సైట్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఇంటిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసేన్స్ జారీ, రెన్యూవల్ చేయడం, లే అవుట్ల అనుమతులు మంజూరు చేయనున్నారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి కావాల్సిన అనుమతులకు సంబంధించి ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని, భవిష్యత్ లో మరిన్ని సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సదస్సులో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమీషనర్ నీతూ ప్రసాద్, డిప్యూటి కమీషనర్ లు రామారావు, సుధాకర్, సిపార్డ్ అధికారులు నరేంద్రనాథ్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Related Posts