YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎస్పీ వర్సెస్ ఎమ్మెల్యే

ఎస్పీ వర్సెస్ ఎమ్మెల్యే

నిజామాబాద్, ఆగస్టు 3, 
అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు.. అధికారుల మధ్య అవగాహన ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు రావు. తేడా కొట్టిందో.. రచ్చ రచ్చే. ఆ జిల్లాలో ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేకు.. జిల్లా ఎస్పీకి మధ్య అదే జరుగుతోందట. తమ పని తప్ప మరో అంశం పట్టని ఇద్దరికీ ఎక్కడ చెడిందనే చర్చ మొదలైంది. ఇంతకీ వారెవరు? ఈయన కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే. ఇక శ్వేతారెడ్డి ఆ జిల్లా ఎస్పీ. బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌ విషయంలో వచ్చిన వైరం ఇద్దరి మధ్యా గ్యాప్‌ తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎప్పుడూ పెద్దగా చర్చల్లోకి రాని ఎమ్మెల్యే షిండే.. ఎస్పీ శ్వేతారెడ్డిలు.. వారి మధ్య వచ్చిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు.. బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌పై అందరి ఫోకస్‌ పడింది. అక్కడేం జరుగుతుందని ఆరా తీసిన వారికి అసలు విషయం తెలిసి.. గట్టిపట్టే పట్టారని చెవులు కొరుక్కుంటున్నారు.కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద ఓ మారుమూల ప్రాంతం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. బిచ్కుంద పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంది. బీర్కూర్‌ క్వారీ ఈ విషయంలో పెట్టింది పేరు. ఇటీవల కొన్ని ఆరోపణలతో బిచ్కుంద సిఐ, ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ పోస్టులన్నీ ఇక్కడ పీఎస్‌లో ఖాళీ. ఇటీవలే బిచ్కుంద పోలీస్‌ స్టేషన్‌లో ఓ సీఐకు పోస్టింగ్‌ ఇచ్చారు. అది స్థానిక ఎమ్మెల్యే హనుమంతు షిండేకు తెలియదట. దీనికంతటికీ ఎస్పీ శ్వేతారెడ్డే కారణమని అనుమానించారట ఎమ్మెల్యే. అంతే ఎస్పీకి ఆయనకు మధ్య వైరం మొదలైందని పార్టీ వర్గాల టాక్‌.ఇన్నాళ్లూ సీఐ పోస్ట్‌ ఖాళీగా ఉంటే ఎలాంటి చర్చ లేదు. కానీ.. మరో అధికారికి పోస్టింగ్‌ ఇవ్వగానే రగడ మొదలైంది. ఎస్పీ వైఖరిపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారట. తన నియోజకవర్గంలో.. తనకు చెప్పకుండా ఎలా పోస్టింగ్‌ ఇస్తారని ఫైర్‌ అవుతున్నట్టు సమాచారం. అంతేకాదు… ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయిన పాత సీఐనే మళ్లీ తీసుకురావాలన్నది అధికారపార్టీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతుండగానే.. కొత్త సీఐని ఎలా వేస్తారన్నది ఎమ్మెల్యే అనుచరులు వేస్తున్న ప్రశ్న.ఈ వివాదం ముదురు పాకన పడటంతో బిచ్కుందలో ఛార్జ్‌ తీసుకోవడానికి కొత్త సీఐ జంకుతున్నారట. ఎమ్మెల్యే, ఎస్పీల గొడవ మధ్య తలదూర్చితే సీన్‌ సితారం అయిపోతుందనే టెన్షన్‌లో ఉన్నట్టు సమాచారం. బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌పై వరసగా ఆరోపణలు వస్తుండటంతో.. వాటికి చెక్‌ పెట్టేందుకు ఎస్పీ శ్వేతారెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారట. సదుద్దేశంతో చేపట్టిన చర్యలు రాంగ్‌ సిగ్నల్‌ పంపాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకపోతే ఇన్నాళ్లూ వివాదాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే, ఎస్పీల మధ్య ఒక పోలీస్‌ స్టేషన్‌లో సీఐ పోస్టింగ్‌ గ్యాప్‌ తీసుకొచ్చింది. అనుమానాలకు.. ఆగ్రహాలకు బీజం వేసింది. వాస్తవానికి నియోజకవర్గాల్లో సీఐలు, ఎస్‌ఐల పోస్టింగ్‌లు చాలా చిన్నవే అయినా.. ప్రజాప్రతినిధుల ఆశీస్సులు లేకపోతే ఇబ్బందే. ఎమ్మెల్యేలు ప్రతిష్టగా తీసుకుంటారు. అందుకే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts