రేణిగుంట
అమర్ రాజా బ్యాటరీ రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలి వెళ్తుంది అన్న వార్తలతో ఒక్కసారిగా అమర రాజా బ్యాటరీ కార్మికుల లో ఆందోళన నెలకొంది. కరోనా కష్టకాలంలో కోడా ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు అందించే కంపెనీ ఇక ఉండదు అన్న వార్తలు తో ఉద్యోగస్తులు కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం కరకంబాడి వద్ద ఉన్న అమర రాజా ఫ్యాక్టరీ ముందు ఏ ఐ టి యు సి కార్మిక సంఘం, తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం ఇంచార్జ్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తోనే అమర రాజా ఫ్యాక్టరీ పక్క రాష్ట్రానికి తరలి వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం లో కొత్త కంపెనీలు తీసుకురావటం పోయి ఉన్న కంపెనీలను కూడా మూసి వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటం తగదని హితవు పలికారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర రాజా ఫ్యాక్టరీ తమిళనాడు తరలి వెళ్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. దేశంలోనే బ్యాటరీ రంగంలో రెండవ స్థానంలో ఉన్న కంపెనీ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోవటం వలన ఎందరో పేద ప్రజల జీవితాలు రోడ్డు పాలు అవుతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి కంపెనీని ఇక్కడే ఉండేటట్లు చూడాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కార్మిక సంఘాలు ప్రతిపక్ష పార్టీ నాయకులు సిద్ధమని హెచ్చరించారు.