YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెట్రో వద్దు..ఎంఎంటీఎస్ ముద్దు..

మెట్రో వద్దు..ఎంఎంటీఎస్ ముద్దు..

మెట్రో రైలు నగరవాసులకు అందుబాటులోకి వస్తే ఎంఎంటిఎస్, ఆర్టీసిపైన ప్రభావం చూపుతోందని తీవ్ర ప్రచారం జరిగింది. మెట్రో రాకతో ఇక వాటికి నష్టాలు తప్పవు అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీలేదని తెలుస్తోంది. మెట్రో ప్రారంభంలో ఎంఎంటిఎస్ కాస్త బోసిపోయినప్పటికీ ఇప్పుడు ఆపరిస్థితి లేదు. మెట్రో ఛార్జీలకంటే ఎంఎంటిఎస్, గ్రేటర్ ఆర్టీసి టిక్కెట్ ధరలు తక్కువ. ఎంఎంటిఎస్‌లో కనిష్ట ధర రూ.5, గరిష్ట ధర రూ.10 ఉంటే మెట్రోలో కనిష్ట ధర రూ.10, గరిష్ట ధర రూ.60గా ఉంది. ఆర్టీసిలోనూ కనిష్ట ధర రూ.5 మాత్రమే. మెట్రో రైళ్ల కంటే కూడా ఎంఎంటిఎస్ ఛార్జీలు చాలా చవకగా ఉన్నాయి. నెలవారీ పాస్ ధర రూ.450 వరకు ఉంది. అదే నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ఒక సారి ప్రయాణించాలంటే రూ.60 అవుతోంది. అదే ఎంఎంటిఎస్‌లో పాస్ తీసుకుంటే నెలంతా ప్రయాణించవచ్చు.టిక్కెట్‌లోని తేడా వల్ల కూడా మెట్రోలో ప్రయాణించాలంటే ఉద్యోగస్తులు ఆలోచిస్తున్నారు. మెట్రో కంటే ఎంఎంటిఎస్ ప్రయాణమే తమకు చౌక అని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. గరిష్ట ధర రూ.10ని చెల్లించి 40కి.మీ వరకు ఎంఎంటిఎస్‌లో ప్రయాణం సాగించవచ్చు. ఈ అవకాశం మెట్రోలో లేకపోవడంతో మెట్రో వేగం పెరిగినప్పటికీ ఛార్జీలు భారీగా ఉండడంతో ఎంఎంటిఎస్‌కు ఆర్టీసికి ఏ మాత్రం తగ్గట్లేదని తెలుస్తోంది. మెట్రో వచ్చి ఐదు నెలలవుతున్నా ఇప్పటి వరకూ మెట్రో యాజమాన్యం నెలవారీ పాస్‌ల ఊసే ఎత్తడంలేదు.మెట్రో మొదటి దశ కారిడార్ నాగోల్ నుంచి అమీర్‌పేట్, అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు రాకపోకలు కొనసాగుతున్నాయి. మెట్రో ప్రారంభంలో జాయ్ రైడ్ చేయటానికే చాలా మంది ఇష్టపడ్డారు. సాధారణ ప్రయాణికుల కంటే ఎక్కువగా మెట్రోను చూడటానికి, మెట్రోలో ప్రయాణం చేయడానికి బారులు తీరారు. కుటుంబ సభ్యులతో కలసి చిన్నా, పెద్దా అంతా కలసి మెట్రో జర్నీ చేయడానికి మెట్రో స్టేషన్లకు బారులు తీరేవారు. మెట్రో ప్రారంభం అయిన రోజుల్లో నిత్యం 1.50 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. సగటున ప్రతి రోజు లక్షకుపైగా ప్రయాణికుల తాకిడి ఉండేది.నవంబర్ 28న ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో ఇలా రోజుకి లక్షకుపైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేవారు. ఎంఎంటిఎస్‌కి, ఆర్టీసికి ఆదరణ కరువవుతోందని అనుకున్నా రు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఎంఎంటిఎస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేట్, ప్రభు త్వ, విద్యార్థులు, వ్యాపార వర్గాలు ఎక్కువగా ఎంఎంటిఎస్ సేవలను పొందుతున్నారు. ప్రైవేట్ సంస్థలల్లో పనిచేసే వారు చాలా మంది ఎంఎంటిఎస్‌పైన ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. హైటెక్‌సిటీకి ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఐటి కంపెనీలు చాలా వరకు హైటెక్ సిటీ, మాధాపూర్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఐటి సంస్థల్లో పనిచేసేవారు నెల వారి పాస్‌లను తీసుకొని నిత్యం ఎంఎంటిఎస్‌లో పయనిస్తున్నారు. రోజుకు సగటున సుమారుగా 1.5లక్షల మంది ప్రయాణికులతో ఎంఎంటీఎస్ 121 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో రైలు నగర వాసులకు అందుబాటులోకి వస్తే గ్రేటర్ ఆర్టీసి సంస్థ కుదేలవుతోందనే వాదనలు వినిపించాయి. మెట్రోలో ప్రయాణిస్తే కేవలం నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఆర్టీసిలో అయితే ట్రాఫిక్ జంఝాటం, చాలా టైం తీసుకుంటుందని అందరూ ఆర్టీసిపై పెదవి విరిచారు. మెట్రో ప్రారంభంలో మొదటి మెట్రో కారిడార్ గుండా నడిచే ఆర్టీసి బస్సుల్లో ఆక్యుపెన్సీ కొంత తగ్గినప్పటికీ తరువాత మెట్రో ప్రభావం అంతగా లేనట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి దాదాపు 1710 ఆర్టీసి బస్సులు మెట్రో కారిడార్ గుండా సేవలను అందిస్తున్నాయి. మెట్రో ఛార్జీల కంటే ఎంఎంటిఎస్, ఆర్టీసిలో టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఇప్పటికీ ప్రయాణికులు ఆర్టీసి, ఎంఎంటిఎస్‌నే ఆశ్రయిస్తున్నారు.

Related Posts