YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మావోయిస్టుల వ్యూహాలు పోలీసుల ప్రతివ్యూహాలు

మావోయిస్టుల వ్యూహాలు పోలీసుల ప్రతివ్యూహాలు

ఆకురాలే కాలం అన్నలకు కష్టకాలంగా మారింది. ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవి మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏడాది మొదటి నుంచి దండకారణ్యంలో మావోయిస్టులు ఓ వైపు, పోలీసులు మరోవైపు దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నారు. ఫలితంగా  పదుల సంఖ్యలో ప్రాణాలు అర్పించుకోవాల్సి వస్తోంది. గడ్చిరోలి ఘటనను నిరసిస్తూ మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. మరోపక్క సమాంతర పాలన సాగే రెడ్‌ కారిడార్‌లో పోలీసులు తమ పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ముప్పేట దాడికి దిగుతుండటంతో ఎన్నడూ లేనంతగా మావోయిస్టులు కోలుకోలేని దెబ్బతింటున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దులో 60మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. కొంతకాలంగా మూడు రాష్ట్రాల్లో పోలీసులు బలగాలు త్రిముఖ వ్యూహంతో కదులుతూ మావోలపై పైచేయి సాధిస్తున్నాయి. నక్సల్‌ సేఫ్‌జోన్‌ అయిన దండకారణ్యలో పోలీసుల చక్రబంధంతో దాడులు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నెల 22న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టుల చరిత్రలో లేనంతగా తమ సహచరులను కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్లో 42 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పరిధిలోని పూజారికాంకేడ్‌ అటవీప్రాంతలోని తడపల గుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో చురకత్తుల్లాంటి పది మంది ప్లాటూన్‌ సభ్యులను కోల్పోయారు. ఈ ఘటనతో అంతర్మధనంలో పడి కొద్ది రోజుల్లోనే కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసు వాహనాన్ని లక్ష్యం చేసుకొని మందుపాతర పేల్చడంతో 10 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఇలా వరుస ఎన్‌కౌంటర్ల నేపధ్యంలో ఉద్యమంపై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన మావోయియిస్టులు అమీతుమీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్లాటూన్‌ సభ్యులను సరిహద్దుల్లో రంగప్రవేశం చేయించి తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడతారనే దాంతో పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, మావోయిస్టుల లక్ష్యంలో ఉన్న వారిని ఇప్పటికే అప్రమత్తం చేశారు. సరిహద్దు పోలీసు స్టేషన్లల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related Posts