8 రాష్ట్రాల్లో కరోనా
న్యూఢిల్లీ, ఆగస్టు 3,
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ స్పష్టం చేసింది. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ అధికంగా ఉన్నట్లు కూడా వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి ఇప్పుడే అంతం అయ్యేలా లేదన్నారు. ఇండియా విషయానికి వస్తే, దేశంలో సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదన్నారు. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో కేస్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. కేరళ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో పాజిటివిటీ ఎక్కువగా ఉన్నట్లు అగర్వాల్ తెలిపారు. యూపీకి 4.88 కోట్ల కోవిడ్ టీకాలు, మహారాష్ట్రకు 4.5 కోట్లు, గుజరాత్‌కు 3.4 కోట్ల కోవిడ్ టీకాలను పంపిణీ చేసినట్లు అగర్వాల్ చెప్పారు.ఆర్ వాల్యూ అంటే.. రిప్రొడక్టివ్ రేట్ వాల్యూ. వైరస్ సంక్రమణ రెట్టింపు అవుతున్న తీరును ఈ పద్ధతిలో అంచనా వేస్తారు. ఇదో గణిత శాస్త్ర విధానంలో ఉంటుంది. సాధారణంగా ఆర్ వాల్యూ ఒకటి కన్నా తక్కువగా ఉంటే అప్పుడు వైరస్‌తో ముప్పు లేదు. కానీ ఒక పాయింట్ దాటితే అప్పుడు ఆర్ వాల్యూతో ప్రమాదమే ఉంటుంది. ఉదాహరణకు ఆర్ విలువ 0.90గా ఉంటే, అప్పుడు 100 మంది వల్ల 90 మందికి వైరస్ సంక్రమించినట్లు అంచనా. ఒకవేళ ఆర్ వాల్యూ ఒకటి దాటితే, అప్పుడు వైరస్ విజృంభిస్తున్నట్లు భావిస్తారు. చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఆర్ వాల్యూను ఇటీవల అంచనా వేసింది. జూన్ 30 నుంచి జూలై వరకు ఆర్ వాల్యూ పెరిగినట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు. దీంతో మళ్లీ ఇండియాలో కరోనా కలవరం మొదలైంది.