సెమీస్ లో భారత్ ఓటమి
టోక్యో, ఆగస్టు 3,
టోక్యో ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కి చేరిన భారత ఫురుషుల హాకీ టీమ్.. అనూహ్యరీతిలో మంగళవారం బెల్జియం చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈరోజు జరిగిన ఫస్ట్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టుని 2-5 తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. దాంతో.. పసిడి పతకం కల చెదరగా.. కాంస్య పతకం కోసం జర్మనీ లేదా ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకూ 8 పసిడి పతకాలు గెలుపొందగా.. చివరిగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది.వరల్డ్ నెం.1 జట్టుగా ఉన్న బెల్జియం టీమ్‌కి సెమీ ఫైనల్లో భారత్ జట్టు గట్టి పోటీనిచ్చింది. 48వ నిమిషం వరకూ రెండు జట్లు 2-2తో నిలవడం ద్వారా ఉత్కంఠని పెంచాయి. కానీ.. ఆ తర్వాత భారత్ డిఫెన్స్‌ని ఛేదించేసిన బెల్జియం రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ని భారత్‌కి దూరం చేసింది. ఆ జట్టులో అలెగ్జాండర్ హ్యాట్రిక్ గోల్స్ చేయగా.. డోమెన్ చివరి నిమిషంలో గోల్ చేసి బెల్జియం టీమ్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. భారత్ టీమ్‌లో హర్మన్‌ప్రీత్, మన్‌దీప్ చెరొక గోల్ చేశారు.టోక్యో ఒలింపిక్స్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ని 3-2 తేడాతో ఓడించి బోణి కొట్టిన భారత హాకీ జట్టు.. ఆ తర్వాత జర్మనీపై 2-0, స్పెయిన్‌పై 3-1, అర్జెంటీనాపై 3-1, జపాన్‌పై 5-3 తేడాతో విజయాల్ని అందుకుంది. కానీ.. మధ్యలో ఆస్ట్రేలియా చేతిలో మాత్రం 1-7 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ.. పుంజుకుని సెమీస్‌కి చేరుకుంది. కానీ.. నాలుగు దశాబ్దాల ఫైనల్‌కి చేరే సువర్ణావకాశాన్ని మాత్రం చేజార్చుకుంది.
కెప్టెన్ తో మాట్లాడిన ప్రధాని
టోక్యో ఒలింపిక్స్‌లో ఊహించని పరాజయాన్ని చవిచూసిన భారత ఫురుషుల హాకీ టీమ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. బెల్జియంతో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖర్లో తడబడిన భారత్ టీమ్ 2-5 తేడాతో ఓడిపోయింది. గ్రూప్ దశ నుంచి ఒక్క ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మినహా.. అద్వితీయ ప్రదర్శన కనబర్చిన హాకీ టీమ్.. 1980 తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ పసిడి గెలిచేలా కనిపించింది. కానీ.. సెమీస్‌లో ఈరోజు ఓడటం ద్వారా పసిడి కల చెదిరింది. కాంస్య పతకం కోసం గురువారం జర్మనీ లేదా ఆస్ట్రేలియాతో భారత్ పోటీపడనుంది.వాస్తవానికి ఈరోజు మ్యాచ్‌లో వరల్డ్ నెం.1 బెల్జియం టీమ్‌కి భారత్ గట్టి పోటీనిచ్చింది. మూడో క్వార్టర్ వరకూ 2-2తో మ్యాచ్ ఉత్కంఠ జరుగుతూ కనిపించింది. కానీ.. నాలుగో క్వార్టర్‌లో భారత్ తడబడి వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. దాంతో.. మ్యాచ్ 2-5తో చేజారగా.. చివరి 15 నిమిషాల్లో బెల్జియం మూడు గోల్స్ చేసేసింది. ఊహించని విధంగా మ్యాచ్ చేజారడంతో.. భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశలో కనిపించారు. మ్యాచ్ తర్వాత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. టోర్నీలో ఇప్పటి వరకూ బాగా ఆడారని ప్రశంసించిన మోడీ.. కాంస్య పతక మ్యాచ్‌కి గుడ్ లక్ చెప్పారు.సెమీస్ మ్యాచ్‌ని చేజార్చుకున్నాం.. ఇది చాలా బాధాకరమైన రోజు. కానీ.. పతకం గెలిచేందుకు మాకు మరో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కోసం మెరుగ్గా సిద్ధమవుతాం. బెల్జియంతో మ్యాచ్‌లో సర్కిల్‌లో పెద్ద తప్పిదాలు చేశాం. అలానే పెనాల్టీ కార్నర్‌లో కూడా. కాంస్య పతక పోరులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని భారత స్ట్రైకర్ మన్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
పంద్రాగస్టుకు గెస్ట్ లుగా ఒలింపిక్ ప్లేయర్స్
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందంతో ప్రధాని మోదీ .. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన భేటీకానున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఆయన ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు. ఆ సమయంలో వారందరితో వ్యక్తిగతంగా మోదీ భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ భారీ సంఖ్యలో అథ్లెట్లను పంపింది. సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వీరితో పాటు వంద మంది కోచ్‌లు, అసిస్టెంట్ సిబ్బంది ఉన్నారు. ఓ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈసారి భారీ సంఖ్యలో భారత బృందాన్ని ఒలింపిక్స్ పంపినట్లు చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘనత సాధించడం అద్వితీయమన్నారు. అనేక క్రీడల్లో మొదటిసారి క్వాలిఫై అయ్యామని, అర్హత సాధించడమే కాదు, గట్టి పోటీ ఇస్తున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ ఒలింపిక్స్‌లో ప్రతి ఆటలోనూ భారత ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. మన ఆటగాళ్లు తమకన్నా మేటి ర్యాంక్‌లో ఉన్నవారి పోరాడుతున్నట్లు చెప్పారు. భారతీయ క్రీడాకారులు ఆత్మవిశ్వాసం, దీక్ష, ఉత్సాహం చాలా ఉన్నతంగా ఉన్నట్లు తెలిపారు. సరైన ట్యాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహిస్తే ఇలాంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని మోదీ అన్నారు.