గోల్డ్ లో చైనా... ఓవరాల్ గా అమెరికా
టోక్యో, ఆగస్టు 3, (న్యూస్ పల్స్)
ఒలింపిక్స్‌లో పది రోజులు ముగిసిపోయాయి. మరో ఐదు రోజుల్లో ఈ ఆటల పండుగ పూర్తి కానుంది. అసలు ఈ మెగా ఈవెంట్ వస్తుందంటేనే మెడల్స్ లెక్కలు మొదలవుతాయ్. ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఇండియా పరిస్థితి ఏంటి? అన్న చర్చ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో పది రోజుల ఆట ముగిసిన తర్వాత ఈ మెడల్స్ టేబుల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఒకసారి చూద్దాం.
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌కు ఉన్న ప్రాధాన్యత తెలుసు కదా. అందుకే మొత్తం పతకాల కంటే ఈ గోల్డ్ మెడల్స్ ఎక్కువ సాధించిన దేశమే టేబుల్‌లో టాప్‌లో ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పది రోజులు ముగిసిన తర్వాత ఈ గోల్డ్ మెడల్స్ లిస్ట్‌లో అమెరికాను వెనక్కి నెట్టి చైనా టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ ఆ టీమ్ ఖాతాలో 29 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక మరో 18 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్ కలిపి చైనా ఖాతాలో మొత్తం 63 మెడల్స్ ఉన్నాయి.అటు అమెరికా ఖాతాలో ఇప్పటివరకూ 22 గోల్డ్ మెడల్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో లిస్ట్‌లో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. అయితే ఓవరాల్ మెడల్స్ మాత్రం అగ్రరాజ్యానికే ఎక్కువ. మరో 27 సిల్వర్, 17 బ్రాంజ్ మెడల్స్‌తో కలిపి అమెరికా ఖాతాలో 66 మెడల్స్ ఉండటం విశేషం. ఇక జపాన్ (18 గోల్డ్, మొత్తం 34), ఆస్ట్రేలియా (14 గోల్డ్, మొత్తం 33), రష్యన్ ఒలింపిక్ కమిటీ (12 గోల్డ్, మొత్తం 50) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇప్పటి వరకూ కేవలం ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్‌తో ఇండియా 63వ స్థానంలో కొనసాగుతోంది.