YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రశ్నార్ధకంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు

ప్రశ్నార్ధకంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు

కర్నూలు, ఆగస్టు 4, 
పట్టణాల్లో ప్రభుత్వం తరఫున సామాన్యులకు వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యుపిహెచ్‌సి) సిబ్బంది బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రస్తుతం పని చేస్తోన్న వారిని కొనసాగించకుండా కొత్త సిబ్బందిని నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోనున్నారు. పట్టణాల్లో ఆరోగ్య సేవలను అందించేందుకు 2,000లో పట్టణ ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో తక్కువ సిబ్బందితో వాటిని నడిపినా నాలుగున్నరేళ్ల క్రితం వాటిని ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించి సిబ్బంది సంఖ్య పెంచారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి ఒక జోన్‌ను ధనుష్‌ అనే సంస్థకు, రెండు జోన్లను అపోలోకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 331 యుపిహెచ్‌సిలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో వైద్యుడు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక స్టాఫ్‌ నర్స్‌, ఇద్దరు ఎఎన్‌ఎంలు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఒక జనరల్‌ అసిస్టెంట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్నారు. అలా 331 యుపిహెచ్‌సిల్లో 1,986 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వాటికి వైఎస్‌ఆర్‌ అర్బన్‌ క్లినిక్‌లుగా నామకరణం చేస్తూ కేంద్రాల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న కేంద్రాలతోపాటు మరో 229 కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఆ సంఖ్యను 560కు పెంచేందుకు సన్నాహాలు చేపట్టింది. అయితే, అన్ని కేంద్రాల్లోనూ కొత్త సిబ్బందిని నియమించుకునేందుకు గతేడాది నవంబర్‌ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుల పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మిగిలిన వైద్య సిబ్బంది నియామకానికి ఈ నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం. దీంతో, సుమారు రెండు వేల మంది రోడ్డునపడనున్నారు. పట్టణాల్లో ప్రభుత్వ వైద్య సేవలను అందిస్తున్న తమను తొలగించి కొత్త వారిని తీసుకోవడం పట్ల సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జిఒ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలకు, డిఎంహెచ్‌ఒలకు, కలెక్టర్లకు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఆళ్ల నానికి వినతిపత్రాలను అందజేశారు. తమను కొనసాగించాలని కోరారు. ప్రస్తుత ఉద్యోగుల భద్రతకు ఎటువంటి ఇబ్బందీ లేదని వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. అయినా, కొత్త సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతుండడంతో సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సాధారణ వైద్య సేవలతో పాటు కరోనా సమయంలోనూ తాము సేవలందించామని, ఇప్పుడు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడం తగదని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుతామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా తమను తొలగించాలని అనుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Related Posts