న్యూఢిల్లీ, ఆగస్టు 4,
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెగాసస్, కొత్త అగ్రి చట్టాలు, కరోనా సెకండ్ వేవ్, ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. అయితే కేంద్రం పెగాసస్‌పై చర్చకు అనుమతించట్లేదు. దీంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సభలో కార్యకలాపాలు కొనసాగనివ్వట్లేదు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్టుపై చర్చకు పట్టుపడుతున్నాయి. దేశంలోని విపక్షనేతలు, జడ్జిలు, సామాజిక కార్యకర్తలతో పాటు కొందరు మంత్రుల ఫోన్లు సైతం పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని పట్టుపడుతున్నాయి. కాగా.. ఇప్పటివరకూ 54 గంటల పాటు పని చేయాల్సిన లోక్‌సభ.. కేవలం 7 గంటలే పని చేసిందని, 53 గంటలు జరగాల్సిన రాజ్యసభ.. కేవలం 11 గంటలు మాత్రమే జరిగిందని తెలుస్తోంది. మొత్తంగా రెండు సభలు 107 గంటల పాటు పని చేయాల్సి ఉండగా... కేవలం 18 గంటలే పనిచేశాయని అధికారులు తెలిపారు. దాంతో 89 గంటల సమయం వృథా కావడంతో పాటు.. దాదాపు 150 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని పార్లమెంట్ అధికారులు స్పష్టం చేశారు.