అనకాపల్లి
అనకాపల్లిలో సర్వే నంబర్ 66 లో 29. 71 ఎకరాల భూమికి సంబంధించి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుటుంబం మరియు దేవాదాయశాఖ మధ్య దశాబ్దాల కాలంగా కోర్టులో వివాదాలు కొనసాగుతున్నాయి. ఆ యొక్క భూమిని ఈరోజు పోలీస్ బందోబస్తు మధ్య స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఈ భూమి దేవాదాయ శాఖకు చెందినదిగా బోర్డులను ఏర్పాటు చేసి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకున్నారు.
ఆ సమయంలో అక్కడ ఉన్న కౌలు రైతులు అధికారులు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులకు సంబంధించిన పశువుల పాకలు అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఉప కలెక్టర్ ఎస్ జె మాధవి మీడియాతో మాట్లాడుతూ ఈ భూమి ఎస్టేట్ మహారాణి అయిన వైరిచర్ల చంద్రమణి మహాదేవి వీలునామా ప్రకారం విశాఖపట్నం మహారాణి పేట లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయమునకు ధూపదీపనైవేద్యాలు నిమిత్తం వ్రాసి ఇచ్చారని. కానీ కొంతమంది వారికి ఉన్న రాజకీయ బలంతో తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టు లిటిగేషన్ పెట్టి కౌలు రైతుల సహాయంతో ఇంత వరకూ భూమిని తమ స్వాధీనంలో ఉంచుకున్నారని. ఈ భూమి దేవాదాయ శాఖ కు సంబంధించినది అంటూ 2003వ సంవత్సరంలో హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తర్వాత అన్ని రెవెన్యూ కోర్టులు కూడా దేవాదాయశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయని కావున తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి 375 కోట్లు విలువ చేస్తుందని తెలియజేశారు.