ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసిన రెజ్లర్ రవికుమార్
టోక్యో ఆగష్టు 4
ఇండియాకు మరో మెడల్ ఖాయం చేశాడు రెజ్లర్ రవికుమార్ దహియా. బుధవారం జరిగిన 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై అతడు గెలిచాడు. విక్టరీ బై ఫాల్‌గా అతన్ని విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన రవికుమార్.. ఇండియాకు కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేయడం విశేషం. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్, యోగేశ్వర్‌దత్‌లు మాత్రమే ఇండియాకు సిల్వర్ మెడల్స్ అందించారు. వాళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో రెజ్లర్‌గా రవికుమార్ దహియా నిలిచాడు. బుధవారం ఉదయం నుంచి రవికుమార్ మొత్తం బౌట్లు గెలిచి మెడల్ ఖాయం చేయడం విశేషం. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్ అతన్ని రింగ్ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్ కింది విజేతగా ప్రకటించాడు. ఉదయం జరిగిన తొలి బౌట్‌లో రవికుమార్ దహియా.. కొలంబియా రెజ్లర్ టైగ్రెరోస్ అర్బానోపై 13-2తో ఈజీగా గెలిచి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత క్వార్టర్స్‌లో బల్గేరియాకు చెందిన జార్జి వలెంటినోవ్‌పై 14-4 తేడాతో విజయం సాధించాడు. ఇక సెమీఫైనల్లోనూ సత్తా చాటి ఫైనల్లో అడుగుపెట్టాడు. గెలిస్తే గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ రెజ్లర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. లేదంటే కనీసం సిల్వర్ మెడల్ అయితే పక్కాగా తీసుకురానున్నాడు.