అమిత్ షా సమాధానం చెబితే నేను శిరో ముండనం చేసుకుంటా
న్యూఢిల్లీ, ఆగస్టు 4,
ఢిల్లీలో 9 ఏళ్ళ మైనర్ బాలిక రేప్, హత్య ఘటనపై హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేసిన పక్షంలో తాను శిరోముండనం చేయించుకుంటానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ సవాలు చేశారు. ఢిల్లీ నగరంలో ఈ బాలిక రేప్, మర్డర్ తీవ్ర సంచలనం కలిగించిన సంగతి విదితమే.(ఈ దారుణానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని, ఢిల్లీ సీఎం. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయగా.. నగరంలో శాంతి భద్రతలు దిగజారుతున్నా హోం మంత్రి అమిత్ షా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు). ఇక డెరెక్ కూడా ఇదే డిమాండ్ చేస్తూ.. ఈ ఘటనపై చట్టసభల్లో అమిత్ షా ప్రకటన చేయాల్సి ఉందన్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తాను ఆయనను పార్లమెంటులో చూడలేదన్నారు. వివాదాస్పద రైతు చట్టలపైనా, క్షీణిస్తున్న దేశ ఆర్ధిక పరిస్థితి పైన, ధరల పెరుగుదలతో సహా అతి ముఖ్యమైన పెగాసస్ వివాదంపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులంతా కోరుతుంటే అమిత్ షా. ప్రభుత్వం పారిపోడం ఏమిటని డెరెక్ ప్రశ్నించారు.తన ‘పాప్రి చాట్’ కామెంట్ పై ప్రధాని మోదీ స్పందన గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఓ సీరియస్ సమస్య ప్రజలకు కనెక్ట్ కావడానికి తాను ఆ పదం వాడానని , బహుశా తను దీని బదులు ‘ఢోక్లా;’ పదాన్ని వాడి ఉంటే ఆయన సంతోషించి ఉండేవారేమోనని వ్యాఖ్యానించారు.నిజంగా మైనర్ బాలిక విషాదాంతంపై అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేస్తే సంతోషిస్తానని, అలాగే నగరంలో లా అండ్ ఆర్డర్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డెరెక్ ఓబ్రీన్ అన్నారు. ఈ నెల 13 తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. అందుకే పార్లమెంటులో బిల్లులన ప్రభుత్వం హడావుడిగా ఆమోదిస్తున్నట్టు కనిపిస్తోందని డెరెక్ అభిప్రాయపడ్డారు.