భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలి
టిటిడి ఈవో డా. కె.ఎస్.జవహర్ రెడ్డి
తిరుమల ఆగస్టు 04
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి ఈవో డా. కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 14 రకాల కూరగాయలతో వారంలో ఒక్కొ రోజు ఒక్కొ రకమైన రుచులతో భక్తులకు అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిద ప్రాంతాల నుండి కూరగాయల అందించే దాతలతో సంప్రదించాలని సూచించారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్యకు తగ్గట్టు తయారీ, పంపిణీ చేసేందుకు అవసరమైన సిబ్బందిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు.
తిరుమలలో ఒక రోజు అన్నప్రసాదాలు, అల్పాహారం అందించే దాతల సంఖ్య పెంచేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. సేవా ధృక్పదం కలిగిన పెద్ద హోటల్స్ యాజమాన్యంతో సంప్రదించి తిరుమలలోని అతిథి గృహలవద్ద కాస్ట్ టు కాస్ట్‌తో కాఫీ, స్నాక్స్ అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు.
అనంతరం శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనికి ప్రవేశించే సుపథం, ఆర్జిత సేవ టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తుల ప్రవేశ మార్గాలపై ఈవో సమీక్షించారు.