బాలల న్యాయ చట్ట సవరణలను స్వాగతించిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ ఆగష్టు 4
బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. సవరణలు చేసిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, ప్రభావవంతంగా అమలుచేయాలని ఆయన సూచించారు. బుధవారం కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, అనాధల సంక్షేమానికి సంబంధించి ఇటీవలి కాలంలో తమ దృష్టికి వచ్చిన అంశాలు, వివిధ విజ్ఞప్తులను కేంద్ర మంత్రికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలల న్యాయ చట్టంలోని ప్రత్యేకమైన అంశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివరించారు. తాజా సవరణల ప్రకారం అనాధ పిల్లలకు సరైన సంరక్షణ అందించే ప్రయత్నం, వారి దత్తతకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే మార్పులను మరింత వేగవంతంగా, పకడ్బందీగా అమలుచేసేలా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు విశేషమైన అధికారాలు కట్టబెడుతున్నదని ఆమె తెలిపారు. అలాగే, అనాధలకు పునరావాసం కల్పించేందుకు ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న తీరును కూడా వివరించి చెప్పారు. అనాధ పిల్లలు ఇబ్బందులు పడకూడదనేదే తమ ఆకాంక్ష అని ఉపరాష్ట్రపతి అన్నారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు కూడా తోడురావాలని, అప్పుడే వారి సంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు మరింత సమర్థంగా అమలయ్యేందుకు వీలవుతుందన్నారు. తెలంగాణకు చెందిన ఎంపీ బండా ప్రకాశ్ ఇటీవల అనాధ పిల్లలతో కలిసి ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనాధల సమస్యలను వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువచ్చారు. అదేరోజున కేంద్ర రక్షన మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షాతో కూడా వెంకయ్య మాట్లాడారు.