శ్రీకాకుళం, ఆగస్టు 5,
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గవిస్తరణ అనేక మందిలో ఆశలు రేపుతుంది. కీలక పదవుల్లో ఉండేవారు సయితం జగన్ కేబినెట్ లో చేరాలని ఉత్సాహపడుతున్నారు. ఇందులో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరుగా చెప్పుకోవాలి. కొద్దిరోజుల్లో జరగబోయే విస్తరణంలో తనకు మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు తన మనసులో మాటను పార్టీ నాయకత్వం ఎదుట ఇటీవల తమ్మినేని సీతారాం బయటపెట్టినట్లు తెలుస్తోంది.సుదీర్ఘకాలం తర్వాత 2019 ఎన్నికల్లో తమ్మినేని సీతారాం శాసనసభకు ఎన్నికయ్యారు. చాలా రోజుల తర్వాత ఎన్నిక కావడం, తాను సీనియర్ కావడంతో మంత్రి పదవి తొలి విడతలోనే వస్తుందని తమ్మినేని సీతారాం ఆశ పెట్టుకున్నారు. అయితే వైఎస్ జగన్ తన వద్దకు పిలిపించుకుని మరీ స్పీకర్ పదవి చేపట్టాలని కోరారు. స్పీకర్ పదవి తమ్మినేని సీతారాం కు అసలు ఇష్టం లేదు. అయినా జగన్ వత్తిడితో బలవంతంగా పదవిని చేపట్టారు.స్పీకర్ గా తమ్మినేని సీతారాం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే ఆయనకు మంత్రి పదవి చేపట్టాలని కోరిక. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం పోటీ చేసే అవకాశం లేదు. ఆయన కుమారుడు నాగ్ ను రాజకీయ అరంగేట్రం చేయించే అవకాశముంది. ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని తమ్మినేని సీతారాం నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తమ్మినేని సీతారాం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.మరి కొద్ది రోజుల్లో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని తమ్మినేని సీతారాం ఇప్పటికే జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే జగన్ మాత్రం అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. ఎన్నికల కేబినెట్ కావడంతో సీనియర్లను కాకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిలోనే కొనసాగుతారా? కేబినెట్ మంత్రి అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.