శ్రీకాకుళం, ఆగస్టు 5,
టీడీపీలో ఇప్పటకి చాలా మంది జూనియర్లకు చంద్రబాబు దగ్గర మనసు విప్పి ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే స్వేచ్ఛ అయితే లేదన్నది వాస్తవం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న కొందరు సీనియర్లు చంద్రబాబుకు చెక్క భజన చేస్తూ ఓ కోటరీగా ఏర్పడ్డారు. పార్టీ అధికారంలోకి రావడానికి ముందు జరిగిన ఎన్నికలతో పాటు గత ఎన్నికల్లోనూ వీరు టిక్కెట్ల ఎంపిక నుంచి అనేక వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చంద్రబాబు సైతం వీరు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి బొక్క బోర్లా పడ్డారు. ఈ లిస్టులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారే చాలా నయం… ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో పాటు వాళ్లకు నచ్చని విషయాలు కుండబద్దలు కొట్టేస్తుంటారు. అయితే యనమల రామకృష్ణుడుతో మొదలు పెట్టి కళా వెంకటరావు లాంటి సీనియర్లు మాత్రం బాబుకు భజన మోగించడంలో ఆరితేరిపోయారు. చంద్రబాబు మాత్రం అప్పుడు వీళ్లకు ప్రయార్టీ ఇవ్వకుండా ఎందుకు ఉంటారు ? పార్టీకి వీరు ఎంత మైనస్ అవుతున్నా వీరినే ఎంకరేజ్ చేస్తూ వస్తుంటారు. ఇప్పుడు కళా వెంకటరావు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని సర్వనాశనం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.మొన్న ఎన్నికల్లో ఆయన ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉండి కూడా తాను గెలవలేదు సరికదా.. మరో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమికి కారణం కావడంతో పాటు విజయనగరం ఎంపీగా అశోక్ గజపతిరాజు ఓడిపోవడానికి కూడా కారణమయ్యారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఆయన ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్నా రాజంలోనే నివాసం ఉంటూ అక్కడ పార్టీ కార్యక్రమాల్లో వేలు పెట్టేస్తుండడంతో రాజంలో పార్టీని ముందుకు నడిపించాలంటేనే మాజీ మంత్రి కొండ్రు మురళీ భయపడే పరిస్థితి వచ్చింది. ఆయనకు ఎచ్చెర్ల నియోజకవర్గం ఉన్నా అక్కడ పార్టీని నడిపించడం వదిలేసి రాజాంలోనూ తన పెత్తనమే ఉండాలని.. అంతా తాను చెప్పినట్టే చేయాలని తన వర్గాన్ని ఉసిగొలుపుతోన్న పరిస్థితి ఉందట.వాస్తవానికి కొండ్రు మురళీ వరుసగా రెండుసార్లు గెలవడంతో పాటు రాజాంలో గెలిచాకే మంత్రి అయ్యారు. మంచి సమర్థత ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు కళా చర్యలతో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో ఉండాలా ? బయటకు వెళ్లాలా ? అని కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి ఆఫర్ లేదనే ఆయన ఊగిసలాటలో ఉన్నారే తప్పా… అక్కడ నమ్మకమైన ఆఫర్ ఉంటే కొండ్రు ఈ పాటికే జెండా మార్చేసేవాడని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. సీనియర్ నేత ప్రతిభా భారతిని రాజకీయంగా అణగదొక్కింది కళానే అన్నది టీడీపీ నేతల బహిరంగ ఆరోపణ. కళా తీరు మారకపోతే ఎచ్చెర్లలో ఆయన ఎప్పటకి గెలిచే పరిస్థితి లేదు.. ఇటు రాజాంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఆయనే దగ్గరుండి మరీ ఓడిస్తాడన్నది పార్టీ డై హార్ట్ ఫ్యాన్స్ ఆరోపణ.ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు తమ్ముడు కుమారుడు నాగార్జున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్థానికంగా నివాసం ఉండట్లేదు. ఎక్కడో వైజాగ్‌లో ఉంటూ ఓ విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా అప్పుడప్పుడు ఓ చుట్టంలా మాత్రమే వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్కడ పార్టీ బలపడే పరిస్థితి లేదు. చీపురుపల్లిలో ఇప్పటికే రెండుసార్లు టిక్కెట్ త్యాగం చేసిన నేతలు ఉన్నా వారిని పక్కన పెట్టిన చంద్రబాబు కళా మాటలు వింటూ నాగార్జుననే అక్కడ ఇన్‌చార్జ్‌గా కంటిన్యూ చేస్తున్నారు. ఆ సీటు కూడా తన ఫ్యామిలీకే ఉండాలని పంతం వేస్తోన్న కళా మొత్తంగా తనను తాను నాశనం చేసుకోవడంతో పాటు అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం జిల్లాల్లో తన వంతుగా పార్టీ నాశనానికి కారణమవుతున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే ఉన్నాయి. ఇక ఈ ప్రభావం అటు విజయనగరం పార్లమెంటు సీటుపై కూడా పడుతోంది. మరి చంద్రబాబు ఈ వాస్తవాలు ఎప్పటకి తెలుసుకుంటారో ? కళా లాంటి నేతలను ఎప్పుడు పక్కన పెడతారో ? చూడాలి