విజయవాడ, ఆగస్టు 5,
దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిషోర్.. పీకే.. విషయంపై వైసీపీ సహా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు గత 2019 ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచి జగన్ ప్రశాంత్ కిషోర్ చూపిన బాటలో నడిచారు. ఆయన చెప్పినట్టే వ్యవహరించారు. పాదయాత్ర కూడా పీకే వ్యూహమేనని అంటారు. అంతేకాదు.. ఈక్రమంలో ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లోనే ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారని పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది. ఇక, జగన్ ప్రకటించిన వలంటీర్ వ్యవస్థ, అమ్మ ఒడి, నేతన్న నేస్తం, వైస్సార్ వాహన మిత్ర, నాడు-నేడు ఇలా అనేక కార్యక్రమాలు ప్రశాంత్ కిషోర్ మదిలోంచే వచ్చాయని అంటారు.నిజానికి ఇలాంటి వ్యూహాలు ఎన్నికల సమయంలో అవసరమైనవే. వీటిని ఎవరూ కాదనరు. కానీ, ప్రశాంత్ కిషోర్ చూపించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిధులతో ముడిపడినవే కావడం గమనార్హం. వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని అనుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రజలకు మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ వ్యవస్థ కేవలం సీఎం జగన్‌ను హీరో చేసింది తప్పితే.. ఇతర నేతలను డమ్మీలను చేసిందనే వాదన ఉంది. పైగా.. న్యాయవ్యవస్థ స్క్రూటినీకి.. ఈ వ్యవస్థ నిలబడుతుందా? అనేది ప్రశ్న.ప్రశాంత్ కిషోర్ సూచించిన ఇతర సంక్షేమ పథకాలను తీసుకున్నా.. ఏటా లక్షల కోట్ల రూపాయలను ఈ పథకాల కింద ప్రజలకు పందేరం చేయాల్సి వస్తోంది. ఎన్నికల్లో విజయానికి ఇవి కారణమైతే.. అయి ఉండొచ్చు. కానీ, ఇంత పెద్ద ఎత్తున నిధులు కుమ్మరించడం వల్ల.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. నెల నెల 1వ తారీకునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, పించన్ల పెంపు కూడా మరింత భారంగా మారింది. దీనిని పెంచాలా వద్దా (ఎన్నికలకు ముందు చెప్పిన మేరకు) అనే విషయంలో జగనే మీమాంసలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక, ఇతర పథకాల అమలు కూడా రాష్ట్రానికి భారంగా మారింది. ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి రావడం.. ప్రతిపక్షాలు విమర్శిస్తుండడం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సహకరించే విషయంలో అడ్డుపుల్ల వేయడం.. వంటివి సహజంగానే సీఎం జగన్‌పై వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక మీడియా.. ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివిందన్నట్టుగా.. తీవ్రస్థాయిలో జగన్‌పై విమర్శలు చేస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహం బెడిసి కొడుతోందా? అనే చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. అదే సమయంలో ఆదాయం పెంపునకు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సలహాలు ఇవ్వకపోవడంపైనా నేతలు చర్చించుకుంటున్నారు. “ప్రభుత్వం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది. మరిఈ సమయంలో ఆదాయం పెంపుపై కూడా ఆయన సలహాలు ఇస్తే బాగుండేది“ అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.