YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పెగాసస్ విచారణ పై సీజేఐ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు

పెగాసస్ విచారణ పై సీజేఐ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ ఆగష్టు 5
దేశవ్యాప్తంగా నిరసన సెగలు రేపుతున్న పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం ప్రారంభమైంది. పెగాసస్ స్పైవేర్ స్కాంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన 9 పిటిషన్లను గురువారం సుప్రీం విచారణ చేపట్టింది.  పెగాసస్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కీలక  వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ గురించి మీడియా నివేదిక నిజమైతే, ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ తమ వాదనలకు అనుకూలమైన మెటీరియల్‌ని అందించలేకపోవడం దురదృష్టకరమన్నారు.  ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులై వుండీ వివరాలు సేకరించడానికి అంతగా ప్రయత్నించలేదన్నారు. అలాగే దీనివల్ల తాము ప్రభావితమయ్యామని చెప్పుకుంటున్న వారు, ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అంతేకాదు రెండేళ్ల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారని కూడా  సీజేఐ ప్రశ్నించారు.   ఈ సందర్బంగా  చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం  కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.పలువురు రాజకీయ ప్రముఖులు, రాజ్యాంగ అధికారులు, జర్నలిస్టులు, జడ్జిలు, హక్కుల నేతలే టార్గెట్‌గా చేసిన ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయకపోవడాన్ని పిటిషన్ల తరపు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కబిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. స్పైవేర్‌ను కొనుగోలు చేసింది ఎవరు, హార్డ్‌వేర్ ఎక్కడ ఉంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగకరమని సిబల్‌ వాదించారు. ఈవ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులివ్వాలన్నారు.  కాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ ఎంపీ, న్యాయవాది పెగాసస్‌  అంశంపై విచారణకు సుప్రీంకోర్టు పిటిషన్లను దాఖలు చేశారు. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్,  సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్,  న్యాయవాది ఎంఎల్ శర్మ  ఇందులో ఉన్నారు. దాదాపు 300 మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టి గూఢచర్యానికి పాల్పడిన కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఈ వ్యవహరాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎడిటర్స్ గిల్డ్ మరో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు పెగాసస్ వివాదం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. దీనిపై  చర్చ జరపాలని, ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నిరసనలు, వాగ్వాదాల నడుమ పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని సర్కార్‌  ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం .

Related Posts