కడప ఆగస్టు 05
కడప నగర శివారులోని శివానంద పురంలో రోడ్డుకు అడ్డంగా కల్వర్టరు కోసం తవ్విన కాలువను కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్, వి.ఎస్.అమీర్ బాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడప నడి బొడ్డున ఉన్న రిజిస్టర్ కార్యాలయాన్ని తీసుకువచ్చి నగర శివారులోని బుద్ధ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది కడప నగర పాలక వర్గాలని మండిపడ్డారు. శివానంద పురంలో కల్వర్టరు కోసం రోడ్డును అడ్డంగా తవ్వి వదిలేసి ప్రజలకు భూలోక నరకాన్ని నగర పాలక వర్గాలు చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిత్యం కోట్లాది రూపాయల ఆర్ధిక లావాదేవీలు జరిగే ప్రదేశంలో ఇలా తవ్వి వదిలేస్తే... జరగరానిది ఏదైనా జరిగితే అందుకు బాధ్యత నగర పాలక సంస్థ పాలక వర్గం తీసుకుంటుందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లే తప్ప ఒక్క రోడ్డు ఈ ప్రాంతంలో నిర్మించలేదు... కనీసం ఈ కల్వర్టరైనా నిర్మించలేరా...? అని కడప నగర పాలక సంస్థ పాలక వర్గాన్ని నిలదీశారు. నగరమంతా అతుకులబోతుకులు... గతుకుల రోడ్లతోనే నెట్టుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వసూళ్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ను పక్కనపెట్టి ప్రజా ఉపయోగకర పనులు చేయాలని పాలక మండలికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివకొండా రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జయకుమార్, కడప పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శివరాం, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధులు అక్బర్, బాలదాసు, రవిశంకర్ రెడ్డి, కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.