కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. జయనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ (60) గుండెపోటుతో మృతి చెందారు. జయానగర్ లోని పట్టాభిరామనగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో విజయ్ కుమార్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. జయానగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ కుమార్ ఈ సారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బెంగళూరులోని జయనగర్, పట్టాభిరామనగర్ ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో విజయ్ కుమార్ కు ఛాతీ నొప్పి రావడంతో ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసింది. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, విజయకుమార్ మృతితో పార్టీకి తీరని నష్టం కలిగిందని ఆ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. విజయకుమార్ కుటుంబసభ్యులకు కర్ణాటక బీజేపీ ప్రగాఢ సంతాపం తెలిపింది. అయన అవివాహితుడు. వారం కిందట చికిత్స చేసుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. బంధువులు, స్నేహితులు ప్రచారానికి వద్దని వారించినా ..ప్రచారానికి వచ్చి గుండె నొప్పితో చనిపోయారు.