శ్రీకాకుళం, ఆగస్టు 6,
శ్రీకాకుళం జిల్లాలో గౌతు ఫ్యామిలీకి మంచి చరిత్ర ఉంది. స్వాతంగ్ర సమరయోధుడు, బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న బలమైన రాజకీయ వారసత్వం వారి సొంతం. అటువంటి గౌతు ఫ్యామిలీ 2019 ఎన్నికల్లో పలాసా నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అంతకు రెండేళ్ల ముందు వరకూ రాజకీయ వాసనలే ఎరుగని ఒక సామాన్య డాక్టర్ సీదరి అప్పలరాజు జగన్ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే అయిపోయారు. అంతే కాదు ఏడాది తిరగకుండా మంత్రి కూడా అయ్యారు. ఆ మీదట ఆయన జోరు చూపిస్తున్నారు. తన ప్రత్యర్ధిగా ఉన్న గౌతు ఫ్యామిలీని ఎదుర్కోవడంతో మంత్రి అప్పలరాజు దూకుడుగా ఉన్నారు. అయితే అది కాస్తా ఇపుడు ట్రాక్ తప్పుతోందని అంటున్నారు. పలాసాలో గౌతు శిరీష 2019 ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె తండ్రి శ్యామ సుందర శివాజీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అంతకు ముందు అయిదేళ్ళూ కూడా ఆమె తండ్రి తరఫున నియోజకవర్గంలో చక్రం తిప్పారు. దాని వల్ల వచ్చిన మంచి కంటే చెడు ఎక్కువై ఆమె ఓడారు. దానికి ఆమె భర్త కూడా చాలా వరకూ కారణం. ఇదిలా ఉంటే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అప్పలరాజు గౌతు ఫ్యామిలీని టార్గెట్ చేశారు అంటున్నారు. మొదట లచ్చన్న విగ్రహాన్ని పలాసా జంక్షన్ లో నుంచి తప్పించడానికి చూశారు. దాంతోనే బీసీలకు వ్యతిరేకం అయ్యారు. పార్క్ స్థలం ఆక్రమణలకు గురి అయిందని మంత్రి చెబుతూ లచ్చన్న విగ్రహాన్ని తొలగించపోయారు కానీ అది బెడిసి కొట్టింది. ఆ తరువాత సైలెంట్ అయ్యారు. అక్కడ టీడీపీ పోరాటమే సక్సెస్ అయింది.శిరీష కూడా గతంలో కంటే ఇపుడు స్పీడ్ పెంచారు. ఆమె ఎక్కువగా విశాఖలో ఉంటారు, క్యాడర్ కి అందుబాటులో ఉండరు అన్న విమర్శలకు చెక్ పెడుతూ ఇపుడు మంత్రిని గట్టిగానే ఢీ కొడుతున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో శిరీష మీద అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారన్నది రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఆమె మహిళ. పైగా ప్రముఖ కుటుంబానికి చెందిన వారు. ఇక బలమైన టీడీపీ వెనక ఉంది. దీంతో ఇదిపుడు అప్పలరాజును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరమైన పోస్టింగులు పెడతారా అంటూ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు గట్టిగానే నిలదీస్తున్నారు. శిరీష కూడా దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీది దిగజారుడు రాజకీయం అంటున్నారు.మంత్రి అప్పలరాజు గౌతు ఫ్యామిలీని రాజకీయంగా గెలవాలి కానీ ఇలాగనా అంటూ అపుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ విషయంలో మంత్రి అప్పలరాజుకి సంబంధం లేకపోయినా అనుచరులు ఎవరైనా అతి చేసినా కూడా ఆయనే బాధ్యుడు అవుతారు. పైగా మహిళా సెంటిమెంట్ తో పెట్టుకుంటే చిత్తు కావడం కూడా ఖాయమే. ఇపుడిపుడే మంత్రి సర్దుకుంటేనే ఇలాంటి వ్యవహారాలు పునరావృత్తం కాకుండా ఉంటాయని అంటున్నారు. బీసీల దైవంగా ఉన్న లచ్చన్న మనవరాలి విషయంలో ఇలా చేస్తే అది నిప్పుతో చెలగాటమే అవుతుంది అని కూడా అంటున్నారు. మరో వైపు రాజకీయ అనుభవ రాహిత్యంతోనే అప్పలరాజు ఇలా దూకుడు చేస్తున్నారా అన్న ప్రశ్న కూడా వస్తోంది. జగన్ కి సన్నిహితుడిగా, సమర్ధుడిగా ముద్రపడిన అప్పలరాజు ఇలాంటి తప్పటడుగులు తమ పార్టీలో ఎవరూ వేయకుండా చూసుకుంటేనే మళ్ళీ మళ్లీ గెలవగలరు అంటున్నారు. మొత్తానికి రాజకీయాలకు అతీతంగా శిరీష విషయంలో మద్దతు దక్కుతోంది. దీని మీద మంత్రి ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించి ముందుకు సాగుతారో చూడాలి.