విజయవాడ, ఆగస్టు 6,
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్‌ఆర్ జలకళ ఆచరణలో కళ తప్పింది. నాలుగేళ్లలో రెండు లక్షల మంది రైతులకు ఉచితంగా బోరు వేయడం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం రూ.2,340 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో ప్రారంభించింది. ఆ సమయంలో మెట్ట పొలాల్లో పైర్లు ఉన్నందున అవి చేతికొచ్చాక బోర్లు వేస్తామని దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా 1,88,082 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో 50,333, ఆఫ్‌లైన్‌లో 1,37,749 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు శాతం మందికైనా బోరు వేయని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తుల్లో విఆర్‌ఒ స్థాయిలో దాదాపు 62 వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1,26,712 దరఖాస్తులను విఆర్‌ఒ స్థాయిలో అప్రూవల్ చేశారు. విఆర్‌ఒ పోర్టల్ నుంచి 1,26,712 దరఖాస్తులు రిగ్గు కాంట్రాక్టర్లకు చేరగా, అందులో 33,610 దరఖాస్తులను మాత్రమే జియాలజిస్టులు సర్వేచేసి అప్రూవల్ ఇచ్చారు. ఇంకా దాదాపు లక్ష దరఖాస్తులు జియాలజిస్టు సర్వే కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. జువాలిజిస్టుల సిఫార్సులతో వెళ్లిన 33,610 దరఖాస్తుల్లో కేవలం 25,682కు మాత్రమే బోర్లు వేసేందుకు అధికారులు సిఫార్సులు చేశారు. అందులో బోర్లు వేసిన వాటిలో ఒక్కదానికైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదరైతుకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్‌డబ్ల్యుఎస్‌లో వేసిన బోర్లుకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివే యడంతో రిగ్గు యజమానులు కొత్తబోర్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జలకళ పథకం స్తంభించి పోయింది. ఆన్‌లైన్ వెబ్‌సైట్ పనిచేయకపోగా, క్షేత్రస్థాయిలో సర్వేలు నిలిచిపోయాయి.