న్యూఢిల్లీ, ఆగస్టు 6,
కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కృష్ణా బోర్డు సిద్ధమయ్యింది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావులకు బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీలతో పాటు.. వాటిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు, కాలువలు, విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ సరఫరా లైన్ల వివరాలను అందజేయాలని కోరారు. కృష్ణా ఉప నది అయిన తుంగభద్రకు సంబంధించి హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ వాటిపై ఉన్న ఎత్తిపోతలు, బ్యారేజీల వివరాలు కూడా అందజేయాలని ఆదేశించారు. అలాగే ఇరు రాష్ట్రాల్లోనూ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి (బేసిన్‌కు) గోదావరి జలాలను మళ్లించే ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గతనెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2 కింద చేర్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు తదితరాలన్నిటినీ అక్టోబర్ 14 నుంచి బోర్డు తన అధీనంలోకి తీసుకోనుంది. రోజువారీగా వాటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనుంది. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తుంది. త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు జారీ చేస్తుంది. కోటా ముగియగానే విడుదలను ఆపేస్తుంది. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ, ఏపీలను ఆదేశించింది నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 589.20 అడుగులుగా ఉంది. 312.0450 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 309.6546 టీఎంసీల నీరుంది. రెండు క్రస్ట్ గేట్ల నుంచి 50,177 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1,11,384 క్యూసెక్కులతో పాటు కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది.జూరాల ప్రాజెక్టు, కాలువలు, విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు, శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్సెల్బీసీ, హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (వెలిగోడు ప్రాజెక్టుతో పాటు అవుకు రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువలు), వెలిగొండ, నాగార్జునసాగర్, విద్యుత్ కేంద్రం, సాగర్ టెయిల్ పాండ్, కుడి, ఎడమ కాలువలు, పులిచింతల ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం, ప్రకాశం బ్యారేజీ, కాలువలు, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలు, కాళేశ్వరం, ఎస్సారెస్పీ ద్వారా కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లించే ఎత్తిపోతలు, తుంగభద్రకు సంబంధించి ఏపీ సరిహద్దు నుంచి హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ (సుంకేశుల బ్యారేజీ), తుమ్మిళ్ల ఎత్తిపోతలు, ఆర్డీఎస్. ఇలావుండగా చిన్న నీటి వనరుల కింద తెలంగాణ చేస్తున్న నీటి వినియోగంపై కృష్ణా బోర్డు మరోమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. తెలంగాణకు చిన్న నీటి వనరుల కింద 89 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నప్పటికీ 174 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బోర్డు స్పందించింది. మరోవైపు బోర్డు పరిధిపై తమ అభ్యంతరాలకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం..వాటిని లేఖ ద్వారా కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలియజేసేందుకు సిద్ధమవుతోంది.