YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత బంధు ఆదుకుంటుందా

దళిత బంధు ఆదుకుంటుందా

కరీంనగర్, ఆగస్టు 6, 
దళిత బందు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని పార్టీలన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అయితే ఏకంగా అక్కడ ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక రకాల హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఇక ఈ పథకం ప్రభావం నియోజకవర్గంలో ఉన్న ఇతర కులాల వారి మీద కూడా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ స్కీమ్ తమ పార్టీని గట్టెక్కిస్తుందనే విశ్వాసంతో టీఆర్ఎస్ వర్గాల వారు ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం ఈ పథకం టీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. దళితులకు పది లక్షల చొప్పున డబ్బులను ఇస్తే మిగతా వారు కూడా తమ సామాజిక వర్గానికి ఈ పథకాన్ని అమలు చేయాలని పట్టుబడతారని అప్పుడు మొదటికే మోసం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా నియోజకవర్గంలో ఉన్న కొంత మంది దళితులు అసలు దళిత బంధు పథకాన్ని నమ్మడం లేదు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పథకం అమలులోనే ఉండదని తాము ఈ పథకాన్ని నమ్మడం లేదని కుండ బద్దలు కొడుతున్నారు.ఇక నియోజకవర్గంలో ఉన్న మిగతా సామాజిక వర్గాల వారు తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించడం గమనార్హం. దళిత బంధు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారని చాలా మంది భావిస్తుండటం వల్లే ముఖ్యమంత్రి తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేశారని చెబుతున్నారు. కానీ వాసాలమర్రి లో దళితుల జనాభా చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హూజూరాబాద్ లీడ్ లోకి గులాబీ
తెలంగాణ ప్రజల ఆసక్తి అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికపైనే. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రజలందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ల మధ్య పోరు గట్టిగా జరిగేలా కనిపిస్తోంది. పైగా ఇక్కడ ఆయా పార్టీలు ఎప్పటికప్పుడు సొంతంగా సర్వేలు చేయించుకుంటూ, సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నాయి.అలాగే పలు స్వతంత్ర సంస్థలు సైతం హుజూరాబాద్‌లో మకాం వేసి ప్రజల నాడి పట్టుకునే పనిలో ఉన్నాయట. అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వే అంచనాల ప్రకారం హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కే లీడ్ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అందుకే సీఎం కేసీఆర్ హఠాత్తుగా వ్యూహాలు మార్చి, రాజేందర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా హుజూరాబాద్‌లో ముందుకెళుతున్నారు. ఇప్పటికే దళితబంధు పేరిట హుజూరాబాద్‌లో ఉన్న ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే సంగతి తెలిసిందే.అలాగే తాజాగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ని నియమించారు. అటు పెన్షన్ వయసు 57 ఏళ్లకు కుదించడం, హుజూరాబాద్‌లో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా ఈటల సామాజిక వర్గానికే చెందిన గీస భిక్షపతి ముదిరాజ్‌ను కొమురెల్లి దేవస్థానం చైర్మన్‌గా నియమించారు.ఈ పరిణామాలన్ని గమనిస్తే హుజూరాబాద్‌లో పైచేయి సాధించేందుకు కేసీఆర్ గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దళితబంధు ప్రకటన తర్వాత తాజాగా టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం…హుజూరాబాద్‌లో కాస్త గులాబీ పార్టీకి అనుకూల వాతావరణం వచ్చిందని తెలుస్తోంది. అయితే ఉపఎన్నిక జరిగే లోపు, మరింతగా హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించేలా ఉన్నారు. మరి వరాలకు హుజూరాబాద్ ప్రజలు కరిగి, కారుని కనికరిస్తారేమో చూడాలి.

Related Posts