YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రివ్యూ: 'నా పేరు సూర్య'

 రివ్యూ: 'నా పేరు సూర్య'

 చిత్రం: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 
నటీనటులు: అల్లు అర్జున్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. శరత్‌కుమార్‌.. అర్జున్‌.. బొమన్‌ ఇరానీ.. రావు రమేష్‌.. చారుహాసన్‌.. వెన్నెల కిషోర్‌.. నదియా.. ప్రదీప్‌ రావత్‌ తదితరులు 
సంగీతం: విశాల్‌-శేఖర్‌ 
ఛాయాగ్రహణం: రాజీవ్‌ రవి 
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు 
కళ: రాజీవన్‌ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి 
నిర్మాత: శ్రీధర్‌ లగడపాటి, బన్ని వాసు, సుశీల్‌ చౌదరి, నాగబాబు 
దర్శకత్వం: వక్కంతం వంశీ 
సంస్థ: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 04-05-2018 
యువతలో మంచి క్రేజ్‌ ఉన్న కథానాయకుడు అల్లు అర్జున్‌. తన స్టైల్‌, డ్యాన్స్‌లతో వెండి తెరపై మెరుపులు మెరిపించేస్తారు. ఇక ఆయన నుంచి చిత్రం వస్తోందంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ఆశిస్తారు. గతేడాది ‘దువ్వాడ జగన్నాథం’తో ఆకట్టుకున్న బన్ని ఈసారి ఓ విభిన్న కథాంశంతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్‌ పట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అల్లు అర్జున్‌ గత చిత్రాలకు పూర్తిభిన్నంగా ఆర్మీ నేపథ్యంలో సాగే కథను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఫస్ట్‌ ఇంపాక్ట్‌ చూసిన ప్రతీ ప్రేక్షకుడు సినిమా పట్ల బన్ని అంకిత భావానికి ఫిదా అయిపోయారు. మరి బిగ్‌ స్క్రీన్‌పై ఇండియా కోసం సూర్య ఏం చేశాడు? రచయిత నుంచి దర్శకుడిగా మారిన వంశీ ఏ మేరకు ఆకట్టుకున్నారు? ఆర్మీ ఆఫీసర్‌గా అల్లు అర్జున్‌ ఎలా ఉన్నారు?
కథేంటంటే: సూర్య(అల్లు అర్జున్‌) ఒక సైనికుడు. కోపం ఎక్కువ. చిన్న తప్పు జరిగినా ఓర్చుకోని మనస్తత్వం. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బోర్డర్‌ వెళ్లాలన్నదే అతడి లక్ష్యం. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదానికి కాల్చి చంపేస్తాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్‌(బొమన్‌ ఇరానీ) నిర్ణయిస్తాడు. కానీ, అందుకు ఒప్పుకోని సూర్య తన గాడ్‌ ఫాదర్‌(రావురమేష్‌)ను రంగంలోకి దింపుతాడు. అంతా బాగానే ఉందని వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణంరాజు 21రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. మరి ఆ ఛాలెంజ్‌లో సూర్య నెగ్గాడా? అతను బోర్డర్‌కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? అనేదే ‘నా పేరు సూర్య’
ఎవరెలా చేశారంటే: అల్లు అర్జున్‌ వన్‌ మెన్‌ షో. ఆయన పాత్ర కోసం తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం ఆ పాత్ర కోసం పడిన కష్టం తెరపై అడుగడుగునా కనిపిస్తుంది. కోపం ఉన్న సైనికుడిగా ఆయన హావభావాలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలోనే ఆయన నటన కెరీర్‌లోనే హైలైట్‌గా నిలుస్తుంది. ఫైట్స్‌, డ్యాన్సుల్లోనూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. వర్షగా అను ఇమ్మాన్యుయేల్‌ అందంగా కనిపించారు. అదే సమయంలో పరిధి మేరకు భావోద్వేగాలు కూడా పండించారు. చల్లాగా శరత్‌కుమార్‌ ఆకట్టుకుంటారు. కార్గిల్‌ పోరాటంలో కాలు కోల్పోయిన సైనికుడు ముస్తఫా(సాయికుమార్‌) పాత్ర కూడా బాగుంది. అర్జున్‌ నటన సినిమాకు ప్రధాన బలం. సూర్య గాడ్‌ ఫాదర్‌గా రావు రమేష్‌ చిన్న పాత్రలో మెరిపిస్తారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సినిమాలో ‘లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో’ ‘దిల్లే ఇండియా’ పాటలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.
సాంకేతికంగా..: తొలిసారి దర్శకత్వం వహించినా.. వక్కంతం వంశీలో పరిణతి తెరపై ప్రతీ సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కథకుడిగా, దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడతాయి. కెమెరామెన్‌ రాజీవ్‌ రవి ఆర్మీ నేపథ్యాన్ని చూపించిన విధానం కొత్తగా ఉంది. విశాల్‌-శేఖర్‌ సంగీతం ఈ సినిమాకు ఉన్న ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. అటు పాటల పరంగానూ, ఇటు నేపథ్య సంగీతం పరంగానూ మంచి ప్రతిభ కనబరిచారు. రాజీవ్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ సినిమాకు కొత్త లుక్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు 
  అల్లు అర్జున్‌ నటన 
  కథ 
  ఆర్మీ నేపథ్యం 
  భావోద్వేగాలు

బలహీనతలు 
 ఆర్మీ నేపథ్యంలో ఎక్కువ సన్నివేశాలు లేకపోవడం 
  ద్వితీయార్ధంలో ప్రసంగంలా సాగే కొన్ని సన్నివేశాలు 
చివరిగా: భావోద్వేగాలతో కదిలించే ‘సూర్య’ 
 
 

Related Posts