సీబీఐ,వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు
జార్ఖండ్ ధన్‌బాద్ సెషన్స్ జడ్జి హత్య కేసు సుమోటోగా విచారణ
దర్యాప్తు సంస్థల తీరును తప్పు పట్టిన సీజేఐ
సీబీఐ తన తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం
ఇలాంటి చార్జిషీట్‌ను ఇప్పటివరకు చూడలేదు
పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌పై కూడా సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ ఆగష్టు 6
దేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సహా వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుప్రీంకోర్టుగా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ.. దర్యాప్తు సంస్థల తీరును తప్పుపట్టారు. తమకు ప్రాణహాని ఉందంటూ న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థలు స్పందిచడం లేదని, వారికి ఏమాత్రం సాయపడటం లేదని సీజేఐ విమర్శించారు.సీబీఐ తన తీరు మార్చుకోవడం లేదు. న్యాయమూర్తులు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీబీఐకి, ఐబీకి ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించడం లేదు. కనీసం వారికి ఎలాంటి సాయం కూడా అందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉన్నది అని సీజేఐ వ్యాఖ్యానించారు. అదేవిధంగా జడ్జి హత్య కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌పై కూడా సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇలాంటి చార్జిషీట్‌ను ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు.చార్జిషీట్‌లో బలమైన సాక్ష్యాలను నమోదు చేయలేదని విమర్శించారు. పోలీసులు చార్జిషీట్ రూపొందించిన తీరుపై తనకు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ లభించేందుకు వీలుపడేలా చార్జిషీట్ రూపొందించినట్లుగా అనిపిస్తుందన్నారు. గత నెల 28న జార్ఖండ్‌లో ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయనను ప్రత్యర్థులు వ్యాన్‌తో తొక్కించి చంపేశారు.ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టుకు తాజాగా సీబీఐకి నోటిసులు జారీచేసింది. జడ్జి హత్య కేసుకు సంబంధించి కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆ నోటీసులలో ఆదేశించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల తీరుపై విమర్శలు గుప్పించిన సీజేఐ రమణ.. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.