వరంగల్, ఆగస్టు 7,
షేర్ల ధరలు నిమిషాల్లో పెరగడం చూసాం.. కానీ భూముల ధరలు నిమిషాల్లో లక్షలకు లక్షలు పెరగడం తొలిసారి చూస్తున్నాం.. అది కూడా మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే. గత వారం ఎకరం 25 లక్షల రూపాయలు ఉన్న భూమి.. వారం తిరక్కముందే ఏకంగా రూ.60 లక్షలకు చేరింది.అవును నిజమే.. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం క్రితం దేవాలయ పరిసర ప్రాంతాల్లోకి గ్రామాల్లో ఎకరం రూ.25 లక్షలు ఉండేది. రామప్ప చెరువు ఉండటంతో ఇక్కడ ఏడాదికి రెండు పంటలు పండుతాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు కొంచం ఎక్కువే అయితే.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో వేగంగా ధరలు పెరిగాయి.చుట్టుపక్కల గ్రామాల్లో రియల్టర్లు వాలిపోయారు. హైదరాబాద్, వరంగల్ తోపాటు స్థానికంగా ఉన్న నేతలు దేవాలయం చుట్టుపక్కల భూములు కొనేందుకు పరుగులు పెడుతున్నారు. పాలంపేట గ్రామంతోపాటు దాని చుట్టుపక్కల రైతులు ఫోన్లతో బిజీ అయిపోయారు. రియల్టర్లు ఒకరితర్వాత ఒకరు రైతులకు ఫోన్ చేసి భూములు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. మరికొందరు వెంచర్ చేసి అమ్మిపెడతామని రైతులకు ఫోన్లు చేసి కోరుతున్నారు.