YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కంటోన్మెంట్ లో రాజకీయం

కంటోన్మెంట్ లో రాజకీయం

హైదరాబాద్, ఆగస్టు 7, 
ఎన్నికల సమయంలో వరదలు వస్తే.. బాధితులకు సాయం చేయడానికి పార్టీలు పోటీపడతాయి. ఓట్లు రాబట్టుకోవాలని చూస్తాయి. ఆ సమయంలో జనాలకు ఇంకేదైనా కష్టం వచ్చినా ఆదుకోవడానికి మేమున్నాం అని ముందుకు వస్తారు నాయకులు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు అధికారపార్టీ నాయకులు. ఇందుకు కరోనాను ముడి సరుకుగా ఎంచుకుని.. జనాలకు వ్యాక్సికేషన్‌ వేస్తూ.. ఓట్లు రాబట్టుకోవాలని చూశారు. పెద్ద కసరత్తే చేసి.. ఆచరణలో పెట్టినా.. నిర్వహణలో చేతులెత్తేశారు. టీకా ప్రయోగం వికటించి.. కంటోన్మెంట్‌ ఎన్నికల్లో రాజకీయంగా ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ పట్టుకుందట.కంటోన్మెంట్‌ బోర్డు పరిధి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఇక్కడ పాలకమండలికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలకు కరోనా టీకాలు వేయించేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ పడ్డాయి. ప్రభుత్వం నిర్ధారించిన సెంటర్లే కాకుండా.. సొంత డబ్బులతో వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు తెరిచారు నాయకులు. మొత్తం 8 వార్డులు ఉంటే.. మూడు చోట్ల సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు రోజూ ఆరోగ్య సిబ్బందిని తీసుకురావడం.. వారికి భోజన సదుపాయాలు కల్పించడం.. తిరిగి ఇళ్ల దగ్గర డ్రాపింగ్‌… ఇలా పెద్ద ప్లానే వేశారు. కొత్తలో బాగానే ఉన్నా.. జనాల తాడికి పెరిగిన తర్వాత చేతులు ఎత్తేశారు నాయకులు. వందల్లో టీకాలు అందుబాటులో ఉంటే.. వేలల్లో వచ్చారు జనాలు. దీంతో తోపులాటలు.. వాగ్యుద్దాలు.. కుర్చీలు విరిగి వ్యాక్సినేషన్‌ సెంటర్లు భీతావహంగా మారిపోయాయి.ఆరోగ్య సిబ్బందిని కేంద్రాలకు ప్రత్యేకంగా తీసుకురావడానికి రవాణా ఖర్చు.. సిబ్బందికి పెట్టే ఇతర ఖర్చులు తడిసి మోపెడు కావడంతో జేబులు ఖాళీ అయ్యి మధ్యలోనే చేతులు ఎత్తేశారు నాయకులు. టీఆర్‌ఎస్‌ తరఫును మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇక్కడ ప్రత్యేక చొరవ తీసుకున్నారట. బీజేపీ తరఫున ఏర్పాటు చేసిన సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పార్టీలు వేసిన ఎత్తుగడ రివర్స్‌ కొట్టింది. జనాలు కూడా చీవాట్లు పెట్టడంతో.. మొదటికే మోసం వచ్చిందిని స్థానిక నేతలు లబోదిబోమంటున్నారట.ఆలోచన మంచిదే అయినా.. నిర్వహణలో లోపాలు.. సరైన ప్లానింగ్‌ లేకపోవడంతో టీకా ప్రయోగం వికటించింది. నిన్న మొన్నటి వరకు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం ఊదరగొట్టిన నాయకులు గప్‌చుప్‌ అయ్యారు. సెంటర్లూ మూసేశారు. ప్రస్తుతం ఆ మాటే ఎవరూ ఎత్తడం లేదు. జరిగిన డ్యామేజీని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలా అని తెగ గుంపు చింపులు పడుతున్నారట.

Related Posts