YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ వ‌ల్లే ప‌రిమితంగా ద‌ర్శ‌న టికెట్లు భ‌క్తుల భాగ‌స్వామ్యంతో నిరంత‌రంగా ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాలు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

కోవిడ్ వ‌ల్లే ప‌రిమితంగా ద‌ర్శ‌న టికెట్లు భ‌క్తుల భాగ‌స్వామ్యంతో నిరంత‌రంగా ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాలు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

కోవిడ్ వ‌ల్లే ప‌రిమితంగా ద‌ర్శ‌న టికెట్లు
భ‌క్తుల భాగ‌స్వామ్యంతో నిరంత‌రంగా ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాలు
టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి
తిరుమల,ఆగస్టు 07
  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనాను డీనోటిఫై చేసే వ‌ర‌కు అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అందువ‌ల్లే తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి త‌క్కువ సంఖ్య‌లో టికెట్లు జారీ చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. లోకకల్యాణం, భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఏడుకొండలవాడి ఆశీస్సులతో ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్యక్రమాలను టిటిడి నిరంతరాయంగా నిర్వహిస్తుందన్నారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో శ‌నివారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలోను, ఆ త‌రువాత జ‌రిగిన మీడియా స‌మావేశంలోను ఈవో మాట్లాడారు.
ఆ వివ‌రాలు ఇవి.
భక్తుల కోసం....
- కరోనా మూడో దశ(థర్డ్‌ వేవ్‌)కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరడమైనది.
- కోవిడ్‌ - 19 పరిస్థితులను అంచనా వేసుకుని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాం.
- భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 5 వేల నుండి 8 వేలకు పెంచడమైనది.
గదుల కేటాయింపు కౌంటర్లు
- ఆన్‌లైన్‌లో గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకున్న భక్తుల కోసం అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశాం.
- స్లిప్పులు స్కాన్‌ చేసుకున్న అనంతరం అలిపిరి టోల్‌గేట్‌ నుండి వెళ్తే 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో నడిచివెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి ఒక గంటలో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.
- కరంట్‌ బుకింగ్‌లో అయితే భక్తులు తిరుమలలోని సిఆర్‌వోతోపాటు ఆరు ప్రాంతాల్లో గల ఏదో ఒక రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌కు వెళ్లి గుర్తింపు కార్డు చూపి పేరు నమోదు చేసుకుంటే గ‌దులు ఖాళీగా ఉంటే 15 నిమిషాల్లో గది కేటాయింపు ఉప విచారణ కార్యాలయం వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతాయి.
- ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా భక్తులను అనుమతించడం లేదు. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తవుతాయి.
కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ :
- గదులు పొందే యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అప్లికేషన్‌ రూపొందించాం. ఫిర్యాదు అందిన అర‌గంట‌లో ఎఫ్ఎంఎస్ సిబ్బంది స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు.
- బసకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన మొబైల్‌ నంబరు  : 9989078111.
ప్ర‌తి గ‌దిలో ఈ నంబ‌రును స్టిక్క‌రు రూపంలో అంటిస్తారు.
హనుమంతుని జన్మస్థలంపై త్వరలో సమగ్ర గ్రంథం
- పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు, పండితులు సమగ్ర పరిశోధన జరిపి అనేక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతులవారి జన్మస్థలమని నిరూపించారు. ఈ అంశంపై జులై 30, 31వ తేదీల్లో అంతర్జాతీయ వెబినార్‌ నిర్వహించాం. దేశంలోని పలు ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు, నిష్ణాతులు పాల్గొన్నారు. వీరి సూచ‌న‌లు, స‌మాచారం ఆధారంగా దీనిపై త్వరలో సమగ్ర గ్రంథం ముద్రిస్తాం.  జాపాలి తీర్థంలోని ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని టిటిడికి అప్ప‌గించాల‌ని దేవాదాయ శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపాం. ఆకాశ‌గంగ‌లో ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం ఏర్పాటుతోపాటు థీమ్‌పార్క్ నిర్మిస్తాం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం
- తిరుపతి  శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను ఈ ఏడాది సెప్టెంబరు 14న ప్రారంభించి 2022 మే నెల నాటికి పూర్తి చేస్తాం.
- భక్తులకు యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుంది, స్వామివారి కైంకర్యాలు కల్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహిస్తారు.
అగ‌ర‌బ‌త్తీల త‌యారీ
- టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌తో త‌యారుచేసిన అగ‌రుబ‌త్తీల‌ను ఆగ‌స్టు 15వ తేదీ నుండి  తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులో ఉంచుతాం. బెంగ‌ళూరుకు చెందిన దర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఆరు బ్రాండ్ల‌తో ఈ అగ‌ర‌బ‌త్తీల‌ను త‌యారుచేసి అందిస్తుంది.
పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు
- కోయంబ‌త్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మ‌శీ స‌హ‌కారంతో 4 నెల‌ల్లోపు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులైన స‌బ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీన‌ర్ లాంటి 15 ర‌కాల ఉత్ప‌త్తులను  అందుబాటులోకి తీసుకువ‌స్తాం. వీటి త‌యారీకి తిరుప‌తి డిపిడ‌బ్ల్యు స్టోర్‌లోని భ‌వ‌నాల‌ను ఉప‌యోగించుకుంటాం. ఇందులో వచ్చే ఆదాయాన్ని దేశీయ గోజాతుల సంరక్షణకు వినియోగిస్తాం.
గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం
- శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండిరచిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా సమర్పించేందుకు చర్యలు చేపట్టాం.
- టిటిడి ఆధ్వ‌ర్యంలోని తిరుమ‌ల‌, తిరుప‌తి, ప‌ల‌మ‌నేరు గోశాల‌ల‌ను సంప్ర‌దాయంగా, శాస్త్రీయంగా నిర్వ‌హించ‌డం కోసం నిష్ణాతులైన వారిని గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టు కో-ఆప్ష‌న్ స‌భ్యులుగా నియ‌మించుకుని వారి స‌హ‌కారం తీసుకుంటాం.
- టిటిడి అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ రైతులతో అనుసంధానం చేసుకుని టిటిడికి ప్ర‌తి ఏటా అవ‌స‌ర‌మ‌య్యే ఏడు వేల ట‌న్నుల శ‌న‌గ‌పప్పు కొనుగోలు చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యం.
- తిరుప‌తి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో ప‌శువుల దాణా త‌యారీ ప్లాంట్‌, ప‌శువుల సంతాన ఉత్ప‌త్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాల‌ని నిర్ణ‌యం.
తిరుమలలో పర్వదినాలు
- ఆగస్టు 13వ తేదీ గరుడపంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణపౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై దర్శనమిస్తారు.
- ఆగస్టు 18 నుండి 20వ తేదీవరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 17న ఆంకురార్పణ నిర్వహిస్తారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యేక కార్యక్రమాలు  
సకలకార్యసిద్ధి శ్రీమద్‌ రామాయణ పారాయణం
- శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలని కోరుకుంటూ జులై 25న  తిరుమలలో సకలకార్యసిద్ధి శ్రీమద్‌ రామాయణ పారాయణ కార్యక్రమం ప్రారంభించాం.
- తిరుమల వసంత మండపం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమం ఆగస్టు 23వ తేదీ వరకు జరుగనుంది. 32 మంది ప్రముఖ పండితులు పాల్గొంటున్నారు.
రంగనాయకుల మండపంలో అధర్వణ వేదపారాయణం  :
- శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధర్వణ వేదపారాయణం జరుగుతోంది.
- లోక క్షేమం కోసం కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 2020, ఏప్రిల్‌ 13 నుండి టిటిడి చతుర్వేద పారాయణం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదంలోని శాఖలు పూర్తయ్యాయి.
సుందరకాండ పారాయణం ముగింపు
- కరోనా మహమ్మారిని దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 409 రోజులపాటు టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరకాండ పారాయణం జులై 24న ముగిసింది.
- అదేవిధంగా, జులై 25వ తేదీ నుండి బాలకాండ పారాయణం జరుగుతోంది.
కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం
- కోవిడ్‌-19 కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీమహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జులై 16 నుంచి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం నిర్వహించాం.
జ్యేష్ఠ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు
- లోక కల్యాణార్థం జ్యేష్ఠ మాసంలో పలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాం.
- కార్తీక, ధనుర్‌, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది.-      
జూన్ 22 నుంచి 24వ తేదీ వ‌రకు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ్యేష్టాభిషేకం నిర్వ‌హించాం
ఆషాడ మాసంలో...
- ఆషాడ మాస శుక్ల ఏకాదశి సందర్భంగా జులై 20న తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా నిర్వహించాం.
శ్రావ‌ణ మాసంలో...
- ఆగ‌స్టు 13న గ‌రుడపంచ‌మి, 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణపౌర్ణ‌మి ప‌ర్వ‌దినాల‌ను నిర్వ‌హిస్తాం. కోవిడ్ పూర్తిగా త‌గ్గిపోయాక ప్ర‌జ‌లంద‌రి భాగ‌స్వామ్యంతో ఇలాంటి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని నిర్వ‌హించే ఆలోచ‌న చేస్తున్నాం.
జులై నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 5.32 లక్షలు
హుండీ :
- హుండీ కానుకలు- రూ.55.58 కోట్లు
- తిరుమల శ్రీవారి ఇ`హుండీ కానుకలు - రూ.3.97 కోట్లు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ`హుండీ కానుకలు - రూ.15 లక్షలు
లడ్డూలు :
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 35.26 లక్షలు
అన్నప్రసాదం :
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 7.13 లక్షలు
కల్యాణకట్ట :
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 2.55 లక్షలు           
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈఓ  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబీసీ సీఈవో  సురేష్‌కుమార్‌తోపాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Related Posts