ఆఫ్ఘాన్‌లో భయానక వాతావరణం
ఇంకా కొనసాగుతున్న కౌంటర్ ఆపరేషన్
ఆఫ్ఘాన్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జలాలాబాద్‌లో ఉన్న ‘సేవ్ ద చిల్డ్రెన్’ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లల సంరక్షణ, హక్కుల కోసం పనిచేస్తోన్న ‘సేవ్ ద చిల్డ్రెన్’ సంస్థ కార్యాలయం ఎదుట కారుబాంబును పేల్చిన టెర్రరిస్టులు.. అనంతరం తుపాకులతో లోపలికి ప్రవేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్నిబట్టి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యాలయం లోపలున్న ఉగ్రవాదులు ఇంకా ఎంతమందికి హానితలపెట్టారో ఇప్పుడే చెప్పలేమని జలాలాబాద్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లల్ని బయటకు తీసుకు వెళుతున్న దృశ్యాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. కౌంటర్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.
గతవారం కాబూల్‌లోని అతిపెద్ద హోటళ్లలో ఒకటైన ఇంటర్ కాంటినెంటల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు 22 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. 2015 నుంచి జలాలాబాద్ ఐసీస్ ఉగ్రవాదులకు స్థావరంగా మారింది. అయితే ఇప్పుడు దాడులకు పాల్పడింది వాళ్లా.. తాలిబన్లా అన్నది లేదా ఇంకెవరనైనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.