ముకుల్ రాయ్ యూ టర్న్
కోల్ కత్తా, ఆగస్టు 7,
బీజేపీలో నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముకుల్ రాయ్ నోరుజారి ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. టీఎంసీ కార్యాలయంలో.. రాష్ట్రంలో త్వరలో జరబోయే ఉప-ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో అక్కడున్న టీఎంసీ నేతలు షాక్ తిన్నారు. దీంతో తాను నోరుజారిన విషయం గుర్తించిన ముకుల్ రాయ్.. సవరించుకున్నారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.మీడియాలో ఈ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారం కావడంతో.. బీజేపీ ఆనందంతో స్వాగతించింది. ముకుల్ రాయ్ తనకు ‘తెలియకుండానే నిజం మాట్లాడారు’ అని వ్యాఖ్యానించింది. ‘‘అసెంబ్లీ ఉప-ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది.. త్రిపురలోనూ గెలుపు తథ్యం.. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు’’ అని ముకుల్ రాయ్ అనేసరికి పక్కనే ఉన్న టీఎంసీ నేతలు అవాక్కయ్యారు. దీనిని గమనించి ఆయన.. వెంటనే స్పష్టతనిచ్చారు.అసెంబ్లీ ఉప-ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయంపై ఎటువంటి అనుమానాలు.. అపోహలు అక్కర్లేదు.. బీజేపీ ఓడిపోవడం ఖాయం.. ఇక్కడ మా మాతీ మనుషు పార్టీ (టీఎంసీ)దే గెలుపు.. త్రిపురలోనూ ఖాతాను తెరవబోతున్నాం.. బెంగాల్‌లో బీజేపీకి ఇక స్థానం లేదు.. పూర్తిగా నిర్వీర్యమపోయారు.. రాష్ట్రంలో మమతా బెనర్జీయే అధికారంలో ఉంటారు’ అని తెలిపారు.మమతా బెనర్జీతో విబేధించి 2018లో టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ బెంగాల్‌లో ఎక్కువ సీట్లు గెలవడం కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి విజయం సాధించిన ముకుల్ రాయ్.. మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు.ముకుల్ రాయ్ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు ముకుల్ రాయ్ ద్రోహం చేశారు.. కానీ ఆయన నిజమే మాట్లాడారు..ఆయన విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నందున నిజం బయటపడింది’ అని కౌంటర్ ఇచ్చారు. అయితే, ముకుల్ కుమారుడు తన తండ్రి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.శరీరంలో రసాయన అసమతౌల్యత కారణంగా అన్ని విషయాలు మరచిపోతున్నారు.. మా అమ్మ మరణం తర్వాత డిప్రెషన్‌తో బాధపడుతున్నారని వివరించారు. ‘నా తండ్రి శరీరంలో విపరీతమైన సోడియం, పొటాషియం అసమతుల్యత ఉంది.. అది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఆయన ప్రతిదీ మర్చిపోతున్నారు.. ఇది నా తల్లి మరణంతో మొదలైంది.. మేము ఆయన ఆరోగ్యం గురించి నిజంగా ఆందోళన చెందుతున్నాం’ అని అన్నారు