*ఏ కర్మమును ఎవరెందులకు చేయుచున్నారో అను దృక్పథమును అనుసరించి సకల కర్మలును, సత్కర్మలు, దుష్కర్మలుగా రెండు తరగతులుగా నేర్పడును. ఏ కర్మ , కష్టములకు, సుఖ దుఃఖములకు రాగద్వేషములకు మనస్సును దారి తీయించునో యది అకార్యము. దేనిని ఆచరించుట వలన మనస్సునకు పరిష్కార మార్గము లభించి, మనస్సునకు బదులు మనము పని చేయుట జరుగునో అది 'కార్యమైన కర్మ'. అనగా చేయదగిన కర్మ.*
*కార్యమైన కర్మను, అనగా లోక శ్రేయస్సునకు పనికి వచ్చు సత్కర్మను చేయుట ఆరంభింపవలెను. సూర్యచంద్రాదుల వలన, పంచ భూతముల వలన ఎట్లు మనకు కావలసినవి సిద్ధించుచున్నవో, అట్లే మనము ఆరంభించు లోక శ్రేయస్కరములైన కర్మల వలన కూడ మనకు కావలసినవి అప్రయత్నముగా సిద్ధించును.*
*ఒక సత్కర్మము ఎవరి ద్వారమున జరిగినదో వానికే ధన్యత. అనగా వాని సంస్కారములు బాగుపడి, మనస్సు, ఇంద్రియములు పరిశుద్ధము అగుచుండును. పైజెప్పిన మార్గమును అవలంబించిన వారు ఫలితములను సన్యసించిరి గనుక సన్యాసులు; యోగస్థితి చెందినవారు గనుక యోగులు. ఈ రెండు స్థితులును సత్కర్మాచరణము వలననే సిద్ధించును. సత్కర్మ మన నమ్మకమును బట్టి కాక, మనకు కావలసిన సాధనను అనుసరించి యుండును. ఈ భేదము తెలిసి కొన్నవాడు లోకమునందు అజ్ఞానమును చూడడు. తనకు 'కార్యమగు కర్మ'ను నిర్మముడు, నిరహంకారుడై ఆచరించును.*
*భ్రాంతి రహితము*
*ఏది లేదో అదే మాయ. ఏది ఉన్నదో అది బయలు. త్రిగుణాత్మకమైన మాయ - మనసు లేనిదే ... త్రిశక్త్యాత్మకం త్రిమూర్త్యాత్మకం అయిన ఎరుక లేనిదే.*
*మాయ ఎప్పుడూ లేదు... ఎరుక- చైతన్యం -కాలచక్రం - కర్మచక్రం ఎప్పుడూ ఉనికి లేనివని చెప్పటమే కైవల్యం.*
*ఏకాక్షర బ్రహ్మమైన ఓంకారమును శబ్ద బ్రహ్మముగా ఉపాసించి నిశ్శబ్ద బ్రహ్మమును తెలుసుకోవాలి ... నీ లోని ప్రజ్ఞ జాగృతమై "సోహం" కావాలి.*