విశాఖపట్టణం, ఆగస్టు 9,
నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలండర్ అని జగన్ ఈ మధ్య విడుదల చేశారు. నిరుద్యోగులకు అది తీరని అన్యాయం చేసే జాబ్ లెస్ క్యాలండర్ అంటూ విపక్షం ఎకసెక్కం ఆడింది. అయితే ఎంతో కొంత నిరుద్యోగ బాధ దానితో తీరడం ఖాయం. మరి ఇపుడు జగన్ సొంత పార్టీలో రాజకీయ నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలండర్ రెడీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే చాలా మంది అలా ఉన్నారు. వీరంతా పదవుల కోసం చకోర పక్షుల్లా గత రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. మరి వీరిలో ఎవరికి పదవులు దక్కుతాయి అన్న చర్చ మొదలైంది.విశాఖ జిల్లాలో ఎన్నికల ముందు చేరిన వారు, ఆనక వచ్చిన వారు చూస్తే కొండవీటి చాంతాడు అంత జాబితా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, పంచకర్ల రమేష్ బాబు, డాక్టర్ ఎస్ అ రహమాన్, మళ్ళ విజయప్రసాద్, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఉంటే, పార్టీ నాయకులు చూస్తే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్, అక్రమాని విజయనిర్మల, ద్రోణం రాజు శ్రీవాత్సవ, పేడాడ రమణికుమారి, దాడి రత్నాకర్, విశాఖ డైరీ డైరెక్టర్ ఆడారి ఆనంద్, చింతకాయల సన్యాసిపాత్రుడు వంటి వారున్నారు. వీరంతా పదవుల మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మరి వీరిలో కొందరిని పదవువులు వరించాయి. మరికొందరిని పక్కనపెట్టారు.ఎవరికి పదవి ఇవ్వాలన్నా కూడా సామాజిక సమీకరణలకే జగన్ పెద్ద పీట వేస్తారు అన్నది తెలిసిందే. దాంతో తమకు ఉన్న అర్హతలను ఒకటికి పదిమారులు వీరంతా చూసుకుంటున్నారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డిని వీరంతా కలసి తన విన్నపాలను కూడా తెలియచేస్తున్నారు. అయితే ఫైనల్ డెసిషన్ జగన్ దే కాబట్టి ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. అదే సమయంలో వీరంతా రేపటి ఎన్నికల్లో పార్టీకి ఎంతవరకూ ఉపయోగపడతారు అన్న ఆలోచనలు కూడా అధినాయకత్వం చేస్తోంది అంటున్నారు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ లో ఈ విషయం స్పష్టమయింది.ఇవన్నీ పక్కన పెడితే జగన్ మొదటి నుంచి పార్టీతో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారుట. అదే కనుక జరిగితే ఎన్నికల ముందు, తరువాత వచ్చి చేరిన వారికి మొండి చేయి తప్పదు అంటున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి వెల్లువలా నాయకులు వచ్చి చేరారు. వీరిలో సమర్ధులు, విదేయత ఉన్న వారికే చాన్స్ అంటున్నారు. అందరికీ ఇస్తూ పోతే అసలైన నాయకులు ఇబ్బంది పడతారు అన్నది హై కమాండ్ భావనగా ఉందిట. అందువల్ల పాత, కొత్త వారిని కలుపుకుని విధేయత, సమర్ధతకే పట్టం కడతారు అంటున్నారు. త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పోస్టులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.