గుంటూరు, ఆగస్టు 9,
నాయకుడంటే విశ్వాసం ఉండాలి. అతను తమ వెంట ఉంటాడన్న నమ్మకం ఉండాలి. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. సీజన్డ్ పొలిటీషియన్ గా మారిపోయారు. వచ్చినప్పుడు భారీ డైలాగులను చెప్పే పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఆ వైపే చూడరన్న విమర్శలున్నాయి. ఆ కాసేపు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతారని ఆ తర్వాత మామూలేనన్నది పవన్ కల్యాణ్ పై వస్తున్న విమర్శ.రాజధాని అమరావతి రైతులకు అండగా నిలుస్తానని పవన్ కల్యాణ్ హడావిడి చేశారు. వారివద్దకు వెళ్లి పెరుగన్నం తిని మరీ డైలాగులు కొట్టారు. అంతే కట్ చేస్తే మళ్లీ అటువైపు చూడలేదు. ఇక బీజేపీతో పొత్తు సందర్భంగా అమరావతి నుంచి విజయవాడ వరకూ రాజధాని రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పొత్తు కుదిరే ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు.పవన్ కల్యాణ్ చెప్పేది ఒకటి చేసెదొకటి అని రాజధాని రైతులు సయితం విమర్శలు చేస్తున్నారు. ఆయన సమయానికి అనుగుణంగా స్టేట్ మెంట్స్ ఇస్తారని ఆ తర్వాత దాని ఊసే ఉండదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ విజయవాడ వచ్చి తాజాగా మళ్లీ హమీలిచ్చి వెళ్లిపోయారు. పక్కా ఇళ్ల నిర్మాణంపై మోసం, జాబ్ క్యాలండర్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.కానీ దీనిపై నిరుద్యోగులు సయితం పెదవి విరుస్తున్నారు. ఎప్పుడు, ఎలా? అనేది లేకుండా స్టేట్ మెంట్ ఇచ్చి వెళ్లిపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ‌్ తొలి నుంచి అంతే. ఒక సమస్యపై పోరాడింది లేదు. ప్రజల పక్షాన నిలిచింది లేదు. ఒక్క రోజు హడావిడి చేయడం మినహా ఆయన ప్రజల్లో ఎక్కువ సేపు ఉండలేరన్నది జనాల్లో విన్పిస్తున్న కామెంట్. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన వైఖరిని మార్చుకోవాలని జనసేన నేతలు కూడా కోరుతున్నారు.