YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

కర్నూలు, ఆగస్టు 9,
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. తగ్గితే పరపతి పోయినట్టే అనుకుంటున్న ఈ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కోసం హైకమాండ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. విబేధాలు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవా? ఇంతకీ ఎవరు వారు?కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య తలెత్తిన విబేధాలు తరచూ వీధికెక్కుతూనే ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్‌రెడ్డి.. మధ్యలో టీడీపీలోకి వెళ్లి తిరిగి వైసీపీలోకి వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సహకరించాలని ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు హఫీజ్‌ఖాన్‌. ఆ తర్వాత ఇద్దరూ వారం రోజులు కూడా కలసి ఉన్నది లేదు. ఎన్నికల ప్రచారంలోనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఇంతలో ఎమ్మెల్యేగా హఫీజ్‌ఖాన్ గెలిచాక ఎస్వీని దూరం పెట్టారు.ఇద్దరు వర్గీయులు పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. తన ప్రమేయం లేకుండా కొందరిని వైసీపీలో చేర్చుకుంటున్నారని ఎస్వీపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్‌లో తన పనులు చేయవద్దని ఎమ్మెల్యే చెప్పారనేది ఎస్వీ వర్గీయుల ఆరోపణ. ఈ విభేదాల కారణంగానే మొన్నటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొందరు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఓడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో ఏర్పడిన ప్రతిష్ఠంభనను సైతం పార్టీ పెద్దలే తొలగించారు. కానీ.. రెండు వర్గాలు రెబల్స్‌ను ప్రోత్సహించి కూర్చున్న కొమ్మనే నరుక్కునే ప్రయత్నం చేశాయి. జిల్లా ఇంచార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి స్థాయిలో పంచాయతీలు జరిగినా సయోధ్య కుదరలేదు.తాజాగా కర్నూలులో వైసీపీ జెండా ఆవిష్కరణ హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య విబేధాలకు ఆజ్యం పోసింది. కర్నూలు ఓల్డ్ సిటీలో ఎస్వీ వర్గీయులు వైసీపీ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదట. ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఫొటోలు కూడా లేవట. ఈ చర్యలు హఫీజ్‌ఖాన్‌ అనుచరులకు ఆగ్రహం కలిగించింది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన స్థానిక కార్పొరేటర్‌, మరికొందరు కలిసి ఆ ఫ్లెక్సీలను తొలగించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. విషయం తెలుసుకుని ఎస్వీ వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో పోలీసుల ఎంట్రీ తప్పలేదు. ఇరువర్గాలకు పోలీసులు నచ్చజెప్పినా ఎవరూ వినలేదట. చివరకు ఎస్వీకి ఫోన్‌ చేసి.. జెండా ఆవిష్కరణ వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరడంతో.. ఘర్షణ తప్పింది. కాకపోతే ఫ్లెక్సీల తొలగింపుపై ఎస్వీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జెండా ఆవిష్కరణ వివాదంపై రెండు వర్గాల వాదన వేర్వేరుగా ఉందట. పార్టీ పెద్దలకు ఎవరి వాదన వారు వినిపించారట. తనను పిలవకపోయినా.. కనీసం స్థానిక కార్పొరేటర్‌కైనా చెప్పాలి కదా అని హఫీజ్‌ఖాన్‌ ప్రశ్నించారట. అయితే వైసీపీ జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే పర్మిషన్‌ తీసుకోవాలా అని ఎస్వీ నిలదీశారట. కర్నూలులో జెండా ఆవిష్కరణ మాత్రమే కాదు.. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. నిత్యం వివాదాలతో రచ్చకెక్కుతున్నారు. మరి.. ఈ ఆధిపత్యపోరుకు పార్టీ పెద్దలు ఎలాంటి పరిష్కరం సూచిస్తారో చూడాలి.

Related Posts