YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సింగరేణికి ఎన్నికలెప్పుడు

 సింగరేణికి  ఎన్నికలెప్పుడు

అదిలాబాద్, ఆగస్టు 9, 
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గత సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో నిర్వహించాల్సి ఎన్నికలు ఇంతవరకూ నిర్వహించకపోవడం పట్ల కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణి పరిధిలోని 11 డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం గతంలో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది డివిజన్లలో విజయం సాధించగా, భూపాల్ పల్లి, మందమర్రి డివిజన్లలో మాత్రమే ఏఐటీసీయూ విజయం సాధించింది. దీంతో ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు నిర్వహించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మికులు విమర్శలు చేస్తున్నారు. గత ఏడాది కరోనా ఉధృతి వలన ఎన్నికలు వాయిదా వేసిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్వహించలేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన కార్మిక సంఘం అధికారంలో ఉండటమే దీనికి కారణమని పలువురు బాహటంగానే ఆరోపణలు చేస్తున్నారు. ప్రాంతీయ లేబర్ కమిషన్ మాత్రం సింగరేణి గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది.సింగరేణి కార్మికుల సమస్యల పట్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం ఏమాత్రం స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవి అమలు పరచడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. సీపీఐ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న ఏటీసీయూ, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎంటీసీయూ, బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్న బీఎంఎస్, సీపీఎం పార్టీకి అనుబంధంగా ఉన్న సీఐటీయూ తోపాటు హెచ్ఎంఎస్, ఎఫ్ఐటీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాలు సింగరేణిలో గుర్తింపుసంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కరోనా ఉన్న సమయాన మున్సిపల్, అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం సింగరేణి ఎన్నికలు జాప్యం చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు.సింగరేణి సంస్థలో కార్మికుల సమస్యలపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే కార్పొరేషన్ స్ట్రక్చర్ మీటింగ్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులతో పాటు, సింగరేణి అధికారులు పాల్గొని ప్రతి సమావేశంలో ఐదు సమస్యలపై చర్చించి వాటి పై తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో కార్మికులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. గత రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహించకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. దీంతో కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు పైరవీలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్లు తదితర అంశాలు సమావేశాలు చర్చించకుండానే అమలు జరగడం పట్ల పలు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటే కార్మికుల సమస్యలు పారదర్శకంగా జరిగేవి. కార్మిక సమస్యలు తుంగలో తొక్కి హైందవి కార్ల రాజు సింగరేణిలో కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి.

Related Posts