లక్నో, ఆగస్టు 9,
ఉత్తర్ ప్రదేశ్ లో అప్పుడే రాజకీయాలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ సిద్ధమయింది. ఉత్తర్ ప్రదేశ్ ను మరోసారి కైవసం చేసుకోగలిగితేనే ఢిల్లీ పీఠంపై హ్యాట్రిక్ కొట్టే అవకాశాలున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణే ఉదాహరణ అని చెప్పుకోవాలి.కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మోదీ ఉత్తర్ ప్రదేశ్ కు పెద్దపీట వేశారు. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో 14 మంది వరకూ కేంద్ర మంత్రులున్నారు. కొత్తగా ఏడుగురికి తన కేబినెట్ లో స్థానం కల్పించారు. మిత్రపక్షమైన అప్పాదళ్ తో పాటు సామాజిక వర్గాల వారీగా పదవులను కేటాయించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీని గెలిపించే బాధ్యతను మోదీ కేంద్ర మంత్రులపై ఉంచారు.ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ అక్కడ ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత బలోపేత మయింది. సమాజ్ వాదీ పార్టీ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుండటం, ఆ పార్టీ బలం పుంజుకుంటుండటంతో బీజేపీలో తత్తరపాటు మొదలయింది. తొలుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ దాస్ ను మార్చాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు.ఇక రానున్న కాలంలో ఉత్తర్ ప్రదేశ్ కు మరిన్ని వరాలను మోదీ ప్రభుత్వం కురిపించే అవకాశముంది. అతి పెద్ద రాష్ట్రాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులకోకూడదన్న లక్ష్యంగా మోదీ, షాలు పావులు కదుపుతున్నారు. కరోనా కారణంగా యూపీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు మోదీ ఇమేజ్ కూడా క్రమంగా పడిపోతుంది. వీటన్నింటిని అధిగమించి యూపీలో తిరిగి గద్దె నెక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో అన్నది చూడాలి. మంత్రులను డంప్ చేసినంత మాత్రాన విజయం వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.